బాలీవుడ్ స్టార్లు ఇప్పుడు తమ జీవితాన్ని అక్షరబద్దం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సైఫ్ ఆలీఖాన్ తన ఆటో బయోగ్రఫిని రాసే పనిని ఆరంభిస్తే, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఏకంగా పూర్తి చేసింది.బాలీవుడ్ హీరోయిన్గా మెప్పించి హాలీవుడ్‌లోనూ నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ప్రియాంక చోప్రా. ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్నో.. తన ప్రయాణాన్ని ‘అన్ఫినిష్డ్’ అనే పుస్తకం రూపంలో తీసుకురాబోతున్నట్లు ప్రియాంక ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం పూర్తయ్యింది. అలాగే తన పుస్తకం కవర్ పేజీని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. జనవరి 19న ఈ ‘అన్ఫినిష్డ్’ ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది. ఈ పుస్తకం కవర్ ఫోటోను, విడుదల తేదీని ప్రకటించారామె.ఈ పుస్తకాన్ని ప్రీ బుకింగ్‌లో కొనుగోలు చేయవచ్చునని అమెజాన్ తెలియజేయగానే పుస్తకానికి అమెరికాలో భారీ డిమాండ్ ఏర్పడింది. గత 24 గంటల్లో అత్యధిక ప్రీ బుకింగ్స్ పొందిన పుస్తకంగా ‘అన్ఫినిష్డ్’ నిలిచింది. ఈ విషయాన్ని కూడా ప్రియాంక తన సోషల్ మీడియాలో తెలియజేస్తూ సంబరపడ్డారు. ఇందులో ప్రియాంక తన బాల్యం, నటిగా తన ప్రయాణం, హాలీవుడ్‌కి వెళ్లడం వంటి విషయాలన్నీ చర్చించారట.
నాతో పాటుగా ప్రయాణం చేయిస్తా!… ‘‘నేను ఇక్కడ వరకూ ఎలా వచ్చానో మీకు చాలావరకూ తెలుసు. నా ప్రయాణాన్ని పూర్తిగా ఈ పుస్తకం ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను’’ అని తన ఆటోబయోగ్రఫీ ‘అన్ఫినిష్డ్’ గురించి చెప్పారు ప్రియాంకా చోప్రా. ‘‘ఈ పుస్తకంతో మీ అందర్నీ నాతో పాటుగా ప్రయాణం చేయిస్తాను అని అనుకుంటున్నాను’’ అన్నారు ప్రియాంక.”20 సంవత్సరాలుగా నేను ఓ సెలబ్రిటీగా పబ్లిక్‌లో ఉన్నా. నేను సెలబ్రిటీగా మారక ముందు..అయిన దగ్గర్నుంచి నా జీవితంలో జరిగిన సంఘటనలకు, ఎదుర్కొన్న సమస్యలకు, అనుభవాలకు అక్షర రూపం ఇచ్చాను. వీటిల్లో చాలా విషయాలు అసంపూర్తిగా ఉంటాయి. నిలిచిపోయిన విషయాలను వదిలేసి మన లక్ష్యాలకు అనుగుణంగా కొత్త వాటిని ఎంచుకుని ముందడుగు వేస్తాం. ఒక్కొక్కరికి ఒక్కో కథ ఉంటుంది. అలాగే నాకూ ఉంది. ఇందులోని విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అలాగే మిమ్మల్ని నవ్వుకునేలా చేస్తాయి’ అని ప్రియాంక చోప్రా తెలిపింది.