రజినీ పార్టీ స్టార్ట్ చేస్తే.. క‌లిసి ప్రజా సేవ చేస్తా !

రాఘ‌వ లారెన్స్ చిన్నారుల గుండె ఆపరేష‌న్స్‌కు సాయం చేయ‌డంతో పాటు.. అనాథ‌లకు ఆశ్ర‌యం క‌ల్పిస్తూ.. చ‌దువు చెప్పిస్తున్నారు. లారెన్స్ చేస్తున్న సేవ చూసేవారు ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌డానికే ప్ర‌జా సేవ చేస్తున్నార‌ని అంటున్నారు. లారెన్స్ త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి వివ‌రణ ఇచ్చారు…
 
“రాజ‌కీయాల్లోకి వెళ్ల‌కుండానే ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌వ‌చ్చు’ అనే విషయాన్ని నేను గ‌త నెల‌లోనే పోస్ట్ పెట్టాను నేను ఈ పోస్ట్ పెట్ట‌డానికి కార‌ణం.. నేను సోష‌ల్ సర్వీస్ చేస్తున్న‌ప్పుడు నా స్నేహితులు, అభిమానులు, మీడియా వారు, రాజ‌కీయ నాయ‌కులు నేను రాజ‌కీయ రంగ ప్ర‌వేశం కోస‌మే సేవ చేస్తున్నాన‌ని అన్నారు. నేను రాజ‌కీయాల్లోకి వెళితే చాలా మందికి సేవ చేయ‌వచ్చున‌ని కొందరు స‌ల‌హా ఇచ్చారు. క‌రోనా స‌మయంలో ఈ ఒత్తిడి మ‌రీ ఎక్కువైంది. అయితే నేను సర్వీస్ చేస్తున్న స‌మయంలో ప్ర‌తిసారి నాకు చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు స‌పోర్ట్ అందించారు. నేను రాజ‌కీయాల్లోకి వెళితే ఇంకా ఎక్కువ సేవ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని నాకు తెలుసు. కానీ…నాకు నెగ‌టివ్ పాలిటిక్స్ నచ్చ‌వు. ఒకరి గురించి చెడ్డ‌గా మాట్లాడ‌టం నాకు న‌చ్చ‌దు. నేను ప్ర‌తి ఒక్క‌రినీ గౌర‌విస్తాను. ఎవరైనా పాజిటివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేస్తే వారితో క‌లిసి ప్ర‌జ‌లకు సేవ చేయ‌డానికి నేను సిద్ధం. అలా పాజిటివ్ విధానంతో రాజ‌కీయ‌పార్టీని స్టార్ట్ చేసి.. ఎవరినీ ఇబ్బంది పెట్ట‌కుండా పాజిటివ్‌గా రజినీ కాంత్ రాజకీయాలు చెయ్య గ‌ల‌రని నేను బ‌లంగా విశ్వ‌సిస్తున్నాను. ఆయన పార్టీని స్టార్ట్ చేస్తే ఏమీ ఆశించ‌కుండా ఆయ‌న‌తో క‌లిసి నేను ప్రజా సేవ చేయ‌డానికి నేను సిద్ధం” అని చెప్పారు రాఘ‌వ లారెన్స్‌.
 
‘చంద్రముఖి’ రూమర్లన్నీ అసత్యాలు !
రజినీకాంత్ బిగ్ హిట్‌ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన చంద్రముఖి సినిమా అన్ని భాషలలో విజయవంతం సాధించింది. కాగా చంద్రముఖి సీక్వెల్‌ సినిమా వార్తను నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఇంతకు ముందే ప్రకటించారు.. అంతేకాదు, ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు లారెన్స్ చెప్పారు .సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని.. గతంలో చంద్రముఖి సినిమాకి దర్శకత్వం వహించిన పి.వాసునే ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నట్టు చెప్పారు.లారెన్స్ ఈ సినిమా గురించి ప్రకటన చేసినప్పటి నుంచి ఈ సినిమాలో ప్రధాన కథానాయిక గురించి రూమర్లు వచ్చాయి. హీరోయిన్‌గా జ్యోతిక అని ఒకసారి, సిమ్రన్ అని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ రూమర్లపై తాజాగా రాఘవ లారెన్స్ స్పందించారు…”‘చంద్రముఖి 2’ కథానాయిక గురించి చాలా రూమర్లు వస్తున్నాయి. జ్యోతిక మేడమ్, సిమ్రన్ మేడమ్ లీడ్ రోల్ చేస్తారని అంటున్నారు. కానీ, ఈ వార్తలన్నీ అసత్యాలు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రకటిస్తా”మని లారెన్స్‌ చెప్పారు.
‘చంద్రముఖి’ కియారా అద్వానీ ?
బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీకి కోలీవుడ్‌ నుంచి కబురొచ్చిందట.‘చంద్రముఖి’ సీక్వెల్‌కి కియారాని కథానాయికగా అడిగారని సమాచారం. రజనీకాంత్‌ హీరోగా పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పి. వాసు సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో లారెన్స్‌ లీడ్‌ రోల్‌ చేస్తారు. హీరోయిన్‌గా కియారా అద్వానీని ఖరారు చేశారట. ‘లక్ష్మీబాంబ్‌’ (‘కాంచన’ హిందీ రీమేక్‌) చిత్రంతో లారెన్స్‌ దర్శకుడిగా బాలీవుడ్‌కి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో కియారాయే హీరోయిన్‌. ‘లక్ష్మీబాంబ్‌’ సినిమా జర్నీలో కియారా వర్క్‌ నచ్చిన లారెన్స్‌ ‘చంద్రముఖి 2’లో కూడా ఆమెనే హీరోయిన్‌ అయితే బాగుంటుందని అనుకున్నారట.