పెద్ద సినిమాలూ ఓటీటీ ‌లోనే విడుదలకు సిద్ధం!

ఎట్టకేలకు పెద్ద సినిమాలు సైతం ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) ఫ్లాట్‌ఫామ్‌లోనే విడుదలకు సన్నద్ధం అవుతున్నాయనే వార్త టాలీవుడ్ ‌లో బాగా వినిపిస్తోంది.. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ అన్నీ మూత పడిన విషయం తెలిసిందే. ఎన్ని అన్‌లాక్‌లు వచ్చినా థియేటర్స్ విషయంలో మాత్రం ‘ఇప్పుడప్పుడే కాదు’ అనే సమాధానమే వినిపిస్తూ వస్తుంది. థియేటర్స్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యం చేయలేకపోతున్నాయి. అయితే ఎప్పుడెప్పుడు థియేటర్స్‌కు అనుమతి వస్తుందా? అని ఎదురుచూస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీ బాట పట్టబోతున్నాయనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే, టాలీవుడ్‌లో అన్ని రెడీ అయి..విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని చిత్రాల వారు మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు. నాని ‘వి’, రామ్ ‘రెడ్’, మెగాహీరో ‘ఉప్పెన’ చిత్రాలతో పాటు, అనుష్క నటించిన ‘నిశ్శబ్ధం’ విషయంలో కూడా నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినవస్తున్నాయి.
 
నాని, సుధీర్‌బాబు నటించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్‌ మొదటివారంలో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుందని సమాచారం. 40 కోట్ల భారీ ఆఫర్‌తో ఈ సినిమా విడుదల హక్కుల్ని ‘అమెజాన్‌’ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే సంస్థ ‘వి’ సినిమాని విడుదల చేయాలనుకుంది. అయితే అప్పుడు చిత్ర దర్శక, నిర్మాతలు, హీరోలు ఓటీటీలో సినిమాని విడుదల చేసేందుకు ఇష్టపడలేదు. ఆ తర్వాత ‘ఆహా’ ఓటీటీ సంస్థ కూడా ఈ సినిమాకి 35 కోట్ల రూపాయల్ని ఆఫర్‌ చేసింది. దీన్ని కూడా చిత్ర బృందం సున్నితంగా తిరస్కరిందనే వార్తలు కూడా నిన్నమొన్నటి వరకు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.
 
సెప్టెంబర్‌ 9 న అక్షయ్ ‘లక్ష్మీబాంబ్‌’
బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీబాంబ్‌’ సినిమా సెప్టెంబర్‌ 9న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల హక్కుల కోసం డిస్నీ సంస్థ ఏకంగా 125 కోట్ల రూపాయల్ని వెచ్చించింది. ఓటీటీలో విడుదలయ్యే తొలి భారీ బాలీవుడ్‌ సినిమా కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ పెద్ద అంచనాలున్నాయి. సెప్టెంబర్‌ 9 అక్షయ్ కుమార్‌ పుట్టినరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం అదే రోజున ఈ సినిమాని ఓటీటీ ద్వారా రిలీజ్‌ చేయనుండటంతో అక్షయ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో వెయిట్‌ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సరసన కైరా అద్వానీ నటించిన ఈచిత్రానికి రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ‘కాంచన-2’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘లక్ష్మీబాంబ్‌’ తెరకెక్కించారు.