ఆమెకి లెక్కలంటే ఫన్‌.. నాకేమో కత్తి మీద సాము!

“ఎవరిదైనా బయోపిక్‌ చేయాలంటే వారిలాగా కనిపించాలనుకోవడం కన్నా ముందుగా..ఆ వ్యక్తి తాలూకా జీవిత సారాంశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం”… అని చెబుతోంది బాలీవుడ్‌ కథానాయిక విద్యాబాలన్‌. వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రాలు.. విలక్షణ పాత్రలకు విద్యాబాలన్‌ పెట్టింది పేరు ..‌ అని వేరే చెప్పక్కర్లేదు. సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ద డర్టీ పిక్చర్‌’లోను, సబ్రినా లాల్‌ కేసు ఆధారంగా రూపొందిన ‘నో ఒన్‌ కిల్డ్‌ జెస్సికా’లోను, ప్రముఖ శాస్త్రవేత్త తారా షిండే జీవితం ఆధారంగా రూపొందిన ‘మిషన్‌ మంగళ్‌’ వంటి బయోపిక్స్‌లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన విద్యా ఇప్పుడు. మరో బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గణితానికి సంబంధించి ఎంతటి చిక్కు సమస్యనైనా ఏ సాధనాలు ఉపయోగించకుండా.. కేవలం తన మేథా శక్తితో చెప్పి హ్యూమన్‌ కంప్యూటర్‌గా యావత్‌ ప్రపంచం కొనియాడిన గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి. ఆమె జీవితం ఆధారంగా ఆమె పేరుతోనే ఓ బయోపిక్‌ తెరకెక్కింది. ‘అమెజాన్‌ ప్రైమ్’ లో ‘శకుంతలాదేవి’ ఈనెల 31న విడుదలవుతోంది.
 
“ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఇంత సంక్లిష్టమైన పాత్రను ఎప్పుడూ చేయలేద”ని విద్యాబాలన్ చెబుతోంది. ఇతర బయోపిక్‌లకు ఈ సినిమాకు ఉన్న తేడా ఏమిటంటే.. శకుంతలాదేవి ఒక జీనియస్‌. లెక్కలతో ఆటాడుకుంటుంది. తెరపై ఆ లెక్కలు సరిగ్గా చెప్పాలంటే.. వాటిని డైలాగుల్లా కాకుండా, అర్థం చేసుకుని అంకెలను చకచకా చెప్పాల్సిందే. ‘‘శకుంతలాదేవికి లెక్కలంటే ఫన్‌. ఆ ఫన్‌ను నేను తెర మీద నటిస్తూనే సృష్టించాలంటే.. ఒకరకంగా కత్తి మీద సామే. పైగా ఆమెకు సెన్సాఫ్‌ హ్యూమర్‌ కూడా ఎక్కువే. మాథ్స్‌లో కూడా సెన్సాఫ్‌ హ్యూమర్‌ను చూపడం మాటలు కాదు. ఆమె గురించిన అనేక విషయాలు వరుసగా తెలుస్తుంటే గానీ.. నేను ఆమె వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. ఎవరిదైనా బయోపిక్‌ చేయాలంటే వారిలాగా కనిపించాలనుకోవడం కన్నా ముందుగా..ఆ వ్యక్తి తాలూకా జీవిత సారాంశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నేను సిల్క్‌స్మిత, శకుంతలాదేవిలాగా కనిపించకపోవచ్చు కానీ.. వారి మనస్తత్వాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను గ్రహిస్తే.. అందులో లీనమైపోవచ్చు. వారిలోని కొన్ని మేనరిజాలను గ్రహించి నా స్టయిల్‌లో వాటిని చూపాలనుకుంటా. ఇందులో కూడా అదే చేశా’’ అన్నారు విద్యాబాలన్‌.
 
వారిలో ఎక్కువ శాతం మహిళలే!
ఈ సినిమా ఒక విధంగా మహిళాశక్తిని చాటింది. ‘శకుంతలాదేవి’ ఈ బయోపిక్‌ కోసం పనిచేసిన వారిలో ఎక్కువ శాతం మహిళలే . ‘లండన్‌- పారిస్‌- న్యూయార్క్‌’, ‘వెయిటింగ్‌’ సినిమాలతో పాటు ఇటీవల అమెజాన్‌ కోసం ‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌’ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేసిన అను మేనన్‌ ఈ సినిమాకు దర్శకురాలు. ఆమెతో పాటు స్ర్కిప్టు రచయిత (నయనిక మహతానీ), సినిమాటోగ్రాఫర్‌ (కీకో నకహరా), క్యాస్టూమ్స్‌ డిజైనర్‌, ఎడిటర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌తో పాటు నిర్మాతలతో ఒకరు… ఇలా చాలామంది మహిళలు ఈ సినిమా కోసం పనిచేశారు.