థియేటర్స్ ఆగస్ట్ 1 నుంచి తెరిచేందుకు కేంద్రం యోచన!

సినిమా పరిశ్రమలో, సినీ ప్రియుల్లో.. శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఎక్కడా లేని ఉత్సాహం. ఇక థియేటర్లు కొత్త పెళ్లికూతురులా ముస్తాబవుతాయి. థియేటర్లల్లో అభిమానుల కోలాహలం. అబ్భో శుక్రవారం సందడే వేరుగా వుంటుంది. ఆ రోజు మార్ని్ంగ్‌ షో చూస్తే వచ్చే కిక్కు వేరుగా వుంటుంది. సినిమా చూసి బయటకి రాగానే సినిమా ఎలా వుంది అని అడుగుతున్న జనాల ఉత్సాహం, యూ ట్యూబ్‌ ఛానెల్స్‌ పబ్లిక్‌టాక్‌లు,వెబ్‌సైట్‌ల రివ్యూలు.. ఇలా ఎంతో కోలాహలం గా కనిపించే శుక్రవారం చూసి మనకు చాలాకాలమయ్యింది. కరోనా మహామ్మారితో ఆ శుక్రవారం కళ తప్పింది.. సినిమా ప్రియులంతా ఆ శుక్రవారం గురించి ఎదురు చూస్తున్నారు‌… ఆ శుక్రవారం మళ్లీ నూతన ఉత్సాహంతో రావాలి…
థియేటర్ల రంగం చాలా నష్టపోతోంది!
థియేటర్ల పునఃప్రారంభంపై జూలై 31వరకు నిషేధాన్ని కొనసాగి స్తోంది.ప్రభుత్వ నిర్ణయంపై ‘మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ అసంతృప్తిని వ్యక్తం చేసింది. నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌లలో థియేటర్ల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని ఓ ప్రకటనలో పేర్కొంది. నిషేదిత జాబితాలో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను కొనసాగించడం తమను ఆవేదనకు గురిచేసిందని చెప్పింది. “మల్టీప్లెక్స్‌ రంగంపై ప్రత్యక్షంగా రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అరవై శాతం రెవెన్యూను రాబడుతూ భారతీయ చిత్ర పరిశ్రమకు థియేటర్లు వెన్నుముకగా నిలుస్తున్నాయి. నటీనటుల నుంచి స్పాట్‌బాయ్స్‌ వరకు లక్షలాది మంది థియేటర్లపై ఆధారపడుతూ జీవనోపాధిని పొందుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమతో పాటు థియేటర్ల రంగం చాలా నష్టపోతున్నది. ఎన్నో వ్యాపారాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం థియేటర్ల కు అనుమతులు నిరాకరించడంతో.. లక్షలాది మంది ఉపాధిలేక సతమతమవుతున్నారు. వనరులన్నింటిని సమీకరించుకొని ఇండస్ట్రీ పూర్వస్థితికి రావాలంటే.. థియేటర్ల ప్రారంభం ఒక్కటే పరిష్కారం. భౌతికదూరాన్ని పాటించడంతో పాటు.. రద్దీని నియంత్రించే చర్యలను చేపడితే థియేటర్లను పూర్తి రక్షణతో నడిపించవొచ్చు. ప్రభుత్వం జారీచేసిన ప్రమాణాల్ని పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, మలేషియా దేశాల్లో భద్రతా ప్రమాణాలతో థియేటర్లు ప్రారంభమయ్యాయి. ప్రేక్షకులు సినిమాలు చూడటానికి వస్తున్నారు. నాన్‌ కంటైన్‌మెంట్‌జోన్‌లలో థియేటర్‌ల ప్రారంభానికి అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి” అని ‘మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ పేర్కొంది.
నిబంధనలతో ఓపెన్ చేయాలనే ఆలోచన!
థియేట‌ర్ల‌ను తెరిచేందుకు కేంద్రం ప్ర‌భుత్వం అనుమతులు ఇవ్వబోతుందా? కరోనా మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించి.. చాలా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత షూటింగ్స్‌కు అనుమతి వచ్చినా.. ఒకటి రెండు చిత్రాలు మినహా.. మరే చిత్రయూనిట్ షూటింగ్‌కు వెళ్లేందుకు సాహసించడం లేదు. కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో షూటింగ్స్ చేయడం కరెక్ట్ కాదని.. కామ్‌గా ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం థియేటర్లకు కొన్ని నిబంధనలు పెడుతూ ఓపెన్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
 
సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా కూర్చునే విధానంలో మార్పులు.. థియేటర్స్‌వారు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే థియేటర్స్‌లోకి అడుగు పెట్టేటప్పుడు గుంపులుగా కాకుండా ఒక్కొక్కరిని.. ఫీవర్ టెస్ట్ చేస్తూ లోపలికి పంపించాలని, వెళ్లే ముందే చేతులను శుభ్రం చేసుకునేలా థియేటర్ బయట శానిటైజ్ విధానం ఉండాలని నియమాలు పెడుతూ.. ఆగస్ట్ 1 నుంచి థియేటర్స్ తెరిచే ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. అలాగే వయస్సు విషయంలో కూడా కొన్ని పరిమితులు పెట్టబోతున్నారని అంటున్నారు. ఇంకా ప్రేక్షకులు కూడా కంపల్సరీగా మాస్క్‌లు ధరించాలని చెబుతున్నారు. ఈ నియమ నిబంధనలను పాటించేలా ఉంటేనే థియేటర్స్ తెరిచేందుకు అనుమతి ఉంటుందని .. ఈ విషయంలో చాలా కఠినంగా ఉండేలా కూడా రూల్స్ తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.