డ్వేన్ జాన్సన్.. రెజ్లింగ్‌లో తన సత్తాను చాటుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్. అనంతరం సినిమాల్లోనూ ప్రవేశించి స్టార్ గా రాణిస్తున్నాడు. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న డ్వేన్‌ను ‘ఇన్‌స్టాగ్రామ్’లో 189 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘జుమాంజి’ వంటి పలు వరల్డ్ హిట్ చిత్రాల్లో నటించిన డ్వేన్ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2019లో అత్యధికంగా సంపాదించే హాలీవుడ్ నటుడిగా నిలిచాడు. సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ హ్యాపర్ హెచ్‌క్యూ ప్రకారం.. అతడు అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం చేసే ఒక్క పోస్టు ద్వారా 7,59,93,050 కోట్ల రూపాయలు అంటే 10,15,000 డాలర్లు ఆర్జిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా అత్యధికంగా డబ్బులు సంపాయించే వారిలో డ్వేన్ తొలి స్థానంలో నిలిచాడు. ఈ మొదటి స్థానంలో టీవీ స్టార్, మేకప్ మొఘల్ కైలీ జెన్నర్ ఉండేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 184 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె గతేడాది ఒక్క పోస్టుకు 1.2 మిలియన్ అంటే ఎనిమిది కోట్లకు పైగా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం కాస్త వెనకబడి ఒక్క పోస్టుకు 7,38,21,820 కోట్లు అందుకుంటూ రెండో స్థానానికి పడిపోయారు. తర్వాతి మూడు స్థానాల్లో వరుసగా ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (6,65,59,430 కోట్లు), జెన్నర్ సోదరి కిమ్ కర్దాషియన్ ( 6,42,38,460 కోట్లు), గాయకుడు, గేయ రచయిత అరియానా గ్రాండే (6,38,64,110) ఉన్నారు.