ప్రియాంక చోప్రా అమెజాన్‌తో కలిసి పనిచేయనున్నారు. అమెజాన్ ప్రైమ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. మల్టీ మిలియన్ డాలర్లు విలువ చేసే ‘ఫస్ట్ లుక్’ అనే టెలివిజన్ డీల్‌పై ఆమె సంతకం చేశారు. ఇందుకోసం ఆమె రెండేళ్లపాటు అమెజాన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక స్పందిస్తూ..
“హిందీ, ఇంగ్లిష్‌ల్లోనే కాకుండా తనకు ఇష్టమైన భాషల్లో కూడా నటిస్తానని ప్రియాంక స్పష్టం చేశారు. మహిళలకు సంబంధించిన కథలను చూపించాలనేదే తన కోరికని.. ఆ కథలను విభిన్నంగా చూపించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప క్రియేటర్స్‌తో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. అందుకు అమెజాన్ లాంటి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగి ఉన్న భాగస్వామి దొరకడం ఆనందంగా ఉందన్నారు. ‘భాష, భౌగోళిక బేధాలు లేకుండా ప్రపంచలోని ప్రతిభ ఒక చోట చేరి మరింత గొప్ప కంటెంట్ సృష్టించాలని ఓ నటిగా, నిర్మాతగా నేను కోరుకుంటాను. నా ప్రొడక్షన్ హౌస్ ‘పర్పుల్ పెబెల్ పిక్చర్స్’ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అమెజాన్‌తో కలిసి పనిచేయడం కొత్తదనానికి పునాది లాంటిది. అలాగే కథకురాలిగా నిరంతరం కొత్త ఐడియాలను అన్వేషించాలనేదే నా తపన. అవి కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ముఖ్యంగా ఓపెన్ మైండ్.. నూతన దక్పథం కలిగి ఉండాలి. నా 20 ఏళ్ల కేరీర్‌లో దాదాపు 60 సినిమాలు చేసిన తర్వాత.. ఇప్పుడు దానిని సాధించే బాటలో ఉన్నాను’ అని చెప్పారు .ఈ తాజా ఒప్పందమే కాకుండా ప్రియాంకా చోప్రాకు ఇప్పటికే రెండు అమెజాన్ ప్రాజెక్టులలో భాగస్వామ్యం ఉంది. ‘సంగీత్’ అనే నాట్యానికి సంబంధించిన రియాలిటీ షో ఒకటి కాగా, మరొకటి ‘సిటాడెల్’ అనే స్పై కథాంశంతో కూడిన షో.
‘అమెజాన్ స్టూడియోస్’ అధినేత జెన్నీఫర్ సాల్కే మాట్లాడుతూ.. ”వైవిధ్యమైన కధాంశాలను తెరకెక్కించాలనే విషయంలో ప్రియాంకదీ, నాదీ ఒకే విధమైన ఆలోచన. ప్రపంచమంతా మెచ్చే వాస్తవికమైన కంటెంట్‌ను అందించేందుకే ఆమెతో చేతులు కలిపాం. రానున్న కాలంలో తనతో కలిసి పని చేస్తుండటం మాకు చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.
ఓ హీరోయిన్ కారణంగా నన్ను తప్పించారు!
హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ ‘గ్లోబల్ స్టార్’గా ఎదిగింది ప్రియాంకా చోప్రా. కెరీర్ తొలి నాళ్లలో ప్రియాంక కూడా నెపోటిజం బాధితురాలేనట. ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుని బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ప్రియాంక తొలి రోజుల్లో కొన్ని అవమానాలు ఎదుర్కొందట. బాలీవుడ్‌లోని బంధుప్రీతి గురించి గతంలోనే ప్రియాంక మాట్లాడింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో నెపోటిజం గురించి ప్రియాంక గతంలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
“బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా. రికమెండేషన్‌తో వచ్చిన ఓ హీరోయిన్ కారణంగా నన్ను ఓ సినిమా నుంచి తప్పించారు. అయితే నేను దానిని అర్థం చేసుకోగలను. ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబంలో పుట్టడం తప్పని నేను చెప్పడం లేదు. కొన్ని మన చేతుల్లో ఉండవు. క్లిష్టమైన అనుభవాలు ఎదురైనపుడు ఎలా స్పందించాలో నేను నేర్చుకున్నా. గమ్యం గురించి తప్ప వేరే దేని గురించీ ఆలోచించకూడదని.. ఓడిపోతామనే భయన్ని దరిచేరనీయకూడదని నిరంతరం నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని` అని ప్రియాంక చెప్పింది.