బాలీవుడ్ ప్రముఖుల వివక్షే అసలు కారణం!

బాలీవుడ్‌లో కొనసాగుతున్ననెపాటిజం (బంధుప్రీతి).. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు కారణమని సోషల్‌ మీడియా వేదికగా నెటిజనులు ధ్వజమెత్తుతున్నారు. బాయ్‌కాట్‌ ఫేక్‌స్టార్స్‌.. బాయ్‌కాట్‌ బాలీవుడ్‌.. నెపాటిజమ్‌ కిల్స్‌ సుశాంత్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.తమ వాళ్లకు అవకాశమిచ్చి.. ఇతరులను అణగదొక్కడం జరుగుతోందని, బాలీవుడ్‌లో పెద్ద కుటుంబాలకు చెందిన నటులకున్న విలువ.. స్వయంకృషితో ఎదిగిన యాక్టర్స్‌కు లేదని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌పై విమర్శలు ఎక్కువగా వచ్చాయి. బాలీవుడ్‌లో ఎవ‌రు ఉండాలో, ఎవ‌రు ఉండ‌కూడ‌దో కపూర్‌లు, ఖాన్‌లు, కరణ్ జోహార్ డిసైడ్ చేస్తారని ఓ టాక్ ఉంది.బాలీవుడ్ ప్రముఖుల వివక్ష కారణంగానే సుశాంత్ ప్రాణం తీసుకున్నాడని ట్వీట్లు చేస్తున్నారు. సుశాంత్ మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేస్తూ.. క‌ర‌ణ్ జోహార్, అలియా భ‌ట్ పెట్టిన ట్వీట్లపై విమర్శలు చేస్తున్నారు. బ‌తికి ఉన్నప్పుడు జాలి చూప‌ని ఇలాంటి వాళ్లు.. ఇప్పుడు సానుభూతి వ‌చ‌నాల‌తో డ్రామాలు ఆడుతున్నారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ‘సుశాంత్ రాజ్‌పుత్ అంటే ఎవరో తనకు తెలియ’దంటూ గతంలో ఆలియా వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ఆమెపై ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇక, స్టార్ వారసులకే పెద్దపీట వేసే కరణ్‌లాంటి వాళ్ల వల్లే ప్రతిభ గల నటులు వెలుగులోకి రాలేక డిప్రెషన్‌కు గురవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
 
కరణ్‌ జోహార్‌, ఖాన్స్‌, భన్సాలీ, టీ సిరీస్‌ కలిసి సుశాంత్‌కు ప్రాధాన్యం లేకుండా చేశారని, సుశాంత్‌ నటించిన ‘దిల్‌ బేచారా’కు కాకుండా చెత్త సినిమా ‘గల్లీ బాయ్స్‌’కు అవార్డు ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ అని ఒకరు ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌లో సుస్మితాసేన్‌ నెపాటిజం బాధితురాలేనని మరొకరు గుర్తుచేశారు. అలాగే, సుశాంత్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలపై ధైర్యంగా మాట్లాడిన హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు పలువురు ట్వీట్ల ద్వారా అభినందనలు తెలిపారు. కాగా, సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో నెపాటిజం అనేది మరోసారి ప్రముఖంగా తెరపైకి వచ్చింది.
 
ప్లాన్‌ ప్రకారం చేసిన మర్డర్‌
బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియా వేదిక గా ఆమె ఓ వీడియో షేర్‌ చేశారు. ఇది ఆత్మహత్య కాదని, ప్లాన్‌ ప్రకారం వ్యవస్థ చేసిన మర్డర్‌ అని బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఆరోపించారు…
‘‘సమాజంలో ప్రతి విషయాన్ని రెండో కోణంలో ఆలోచించాలంటారు కదా! ఎవరి మనసు బలహీనంగా మారుతుందో వారే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అలాంటి వాళ్లే ఆత్మహత్యకు పాల్పడతారు. స్టాన్‌ఫోర్డ్‌ స్కాలర్‌షిప్‌ సాధించిన యువకుడు, ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌లో ఏడో ర్యాంక్‌ సాధించిన విద్యార్థి, సినిమా కెరీర్‌లో విజయం సాధించిన సుశాంత్‌లాంటి వ్యక్తి మనసు ఎలా బలహీనమవుతుంది?’’ అని కంగనా ప్రశ్నించారు. ‘‘నా సినిమాలు చూడండి” అంటూ సుశాంత్‌ ఓ సందర్భంలో ఎంతగా అభ్యర్థించాడో తెలుసా? “నాకు గాడ్‌ఫాదర్‌ లేడు, నా సినిమాలు ఆడకపోతే ఇక్కడి నుంచి నన్ను పంపించేస్తారు. ఈ ఇండస్ట్రీ నన్ను తనలో ఒకడిగా ఎందుకు భావించడం లేదు?” అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు చెప్పండి… ఈ ఘటనలో మన ప్రమేయమేమీ లేదంటారా?’’ అంటూ కంగన బాలీవుడ్‌ ఇండస్ట్రీని నిలదీశారు.
సుశాంత్‌ ‘తొలి చిత్రం ‘కై పో చే’ చక్కగా ఉన్నా తనకు గుర్తింపు దక్కలేదు. ‘ఎంఎస్‌ ధోని’, ‘కేదార్‌నాథ్‌’, ‘చిచ్చోరే’ చిత్రాలకు గుర్తింపు ఏది? ‘గల్లీబాయ్‌’లాంటి సినిమాలకు అవార్డులు దక్కాయి. ‘చిచ్చోరే’ వంటి ఉత్తమ చిత్రాలను, ఆ దర్శకులను పట్టించుకోలేదు?’’ అంటూ పరిశ్రమ బంధుప్రీతిని కంగనా విమర్శించారు. ‘‘ఏ బ్యాగ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టినవారికి మీడియా అండగా ఉంటుందని అంటారు. ప్రతిభను గుర్తించి కష్టసమయాల్లో అండగా ఉండాలి. కానీ ఆర్టిస్టులు వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్థికంగా నలిగిపోతున్న సమయంలో.. వారిపై ఎక్కువగా దృష్టి పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదు’’ అని మీడియాకు కూడా చురకలు వేశారు.
 
వారి కథలు నాకు తెలుసు!
అర్ధంతరంగా తనువు చాలించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ గురించి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సుశాంత్‌ను ఇలా చేసిన వారి కథలు తనకు తెలుసంటూ శేఖర్ కపూర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. శేఖర్ కపూర్, సుశాంత్ కలిసి గతంలో `పానీ` సినిమా చేయాలనుకున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించాల్సింది. అయితే అన్నీ కుదిరిన తర్వాత యశ్‌రాజ్ సంస్థ ఎందుకో వెనక్కి తగ్గింది. దీంతో ఆ సినిమా ఆగిపోయింది. తాజాగా సుశాంత్ మరణం గురించి శేఖర్ వివాదాస్పద ట్వీట్ చేశారు. “సుశాంత్.. నువ్వు పడ్డ ఆవేదన నాకు తెలుసు. నిన్ను దారుణంగా హింసించిన వారి గురించి నాకు తెలుసు. నువ్వు బాధపడుతూ నా భుజాలపై పడి కన్నీరు పెట్టుకున్నావు. గత ఆరు నెలలు నేను నీ దగ్గర ఉండుంటే బాగుండేది. నువ్వు నన్ను కలిసుంటే బాగుండేది. నీకు ఇలా జరగడం వాళ్ల కర్మ. నీది కాదు” అంటూ శేఖర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
వివేక్ సంచ‌ల‌న ట్వీట్!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన అనంత‌రం న‌టుడు వివేక్ ఓబెరాయ్ తన ట్విట్ట‌ర్‌ఖాతాలో ఒక ఓపెన్ లెట‌ర్ రాశారు. ఆ లేఖ‌లో వివేక్ త‌న మ‌న‌సులో దాగున్న విష‌యాల‌ను బ‌య‌టపెట్టారు. వివేక్ చేసిన ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది….
ఈరోజు సుశాంత్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొనాల్సి రావ‌డం ఎంతో బాధాక‌రం. అత‌ని వ్య‌క్తిగ‌త బాధ‌ల‌లో నేను పాలు పంచుకుని ఉంటే.. అత‌నికి కొంత ఊరట ల‌భించివుండేది. ఆ ప‌ని చేయ‌నందుకు ఇప్పుడు ఎంతో బాధ‌గా ఉంది. ఇది న‌న్నెంత‌గానే వేధిస్తోంది. అయితే చావు అన్నింటికీ ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య ప‌రిస్థితుల‌ను మార్చలేదు. సుశాంత్ త‌న కుటుంబ స‌భ్యులు, అభిమానుల గురించి ఒక్క‌సారి ఆలోచించినా ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాదు. అత‌ని తండ్రి కుమారుని చితికి నిప్పు పెడుతున్న‌‌ప్పుడు అత‌నిని చూడ‌లేక‌పోయాను. సుశాంత్ సోద‌రి త‌న సోద‌రుడిని తిరి‌గి ర‌మ్మ‌ని వేడుకుంటూ రోదించ‌డం కంట‌త‌డి పెట్టించింది. ఈ బాధ‌ను మాట‌ల‌లో వ‌ర్ణించ‌లేను. మ‌న ఇండ‌స్ట్రీ అంతా ఒకే కుటుంబ‌మ‌ని చెబుతుంటారు. ఈ మాట‌ను అంద‌రూ ఒక‌సారి గుర్తు చేసుకోవాలి . మ‌న‌లో మార్పు రావాలి. ఇత‌రులకు చెడు చేసేకంటే మంచి చేసేందుకు ప్ర‌య‌త్నించాలి. అహంకారాన్ని ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌తిభ ఉన్న‌వారిని ప్రోత్స‌హించాల్సిన‌ అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇప్పుడు జ‌రిగిన ఘ‌ట‌న మ‌నందరికీ వేక‌ప్ కాల్ లాంటిది. ఎప్పుడూ న‌వ్వుతూ తుళ్లుతూ తిరిగే సుశాంత్‌ను నేను మిస్స‌య్యాను “..అని వివేక్ రాశారు.