నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడారు… ‘‘ప్రతి వ్యక్తికి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలుంటాయి. అలాంటి ఘట్టం 60వ పుట్టినరోజు..నా షష్టిపూర్తి. ఇలాంటి రోజును అభిమానులతో ఘనంగా జరుపుకోవాలని అనుకున్నాం. కానీ కరోనా కారణంగా అన్నీ ప్రాంతాల నుండి అభిమానులు రావాలంటే చాలా ఆంక్షలున్నాయి. అందువల్ల పుట్టినరోజును జరుపుకోలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది.
అన్ని కులాలు, వర్గాలు, మతాలవాళ్లు నా అభిమానులుగా ఉన్నారు. మీకు, నాకు మధ్య ఉన్న అనుబంధం ఏంటి? అని కొన్నిసార్లు అనిపిస్తుంది.ఇన్ని కోట్ల మంది అభిమానులను పొందడం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. నా కష్టాల్లో నా వెన్నంటే నిలబడ్డారు. ఎన్నో సినిమాలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తున్నారు. నేను సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాదు.. నా అభిమానులు కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నేను జీవితంలో ఏదైనా గొప్పగా సాధించానంటే.. అది ఇంత మంది అభిమానమే.
నందమూరి తారక రామారావుగారు నాకు తండ్రే కాదు గురువు, దైవం, స్ఫూర్తి ప్రదాత. వారు ఇచ్చిన ధైర్యంతో ఈ పుట్టినరోజుకు ‘శివ శంకరి..’ పాటను పాడాను. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా టీజర్‌ను విడుదల చేశాం. సాధారణంగా నేను పాడిన పాటను పెద్దగా ఎవరూ అటెంప్ట్ చేయరు. నేను బ్రహ్మాండంగా పాడానని చెప్పను కానీ.. ఓ ప్రయత్నం చేశాను. ఆసక్తితో పాట పాడాను. ఇక నేను, బోయపాటి గారితో చేస్తున్న సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మా కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. మా ఇద్దరికీ అండర్ స్టాండింగ్ ఉంటుంది. ఈ సినిమా టీజర్ నెంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో ఉంది. సాధారణంగా నేను, బోయపాటిగారు చాలా స్పీడుగా సినిమా పూర్తి చేస్తాం. టీజర్‌ను చూసి సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలుసు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఇంకా రెట్టింపు వేగంతో పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్స్ ఎలా చేయాలనేది ఇండస్ట్రీలో అందరం కలిసి ఆలోచన చేస్తాం’’ అన్నారు.