కాజల్ వరుసగా క్రేజీ ఆఫర్స్‌తో తన అభిమానులను మరింత అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘కాజల్ పనైపోయింది’ అనుకుంటున్న ప్రతిసారీ ఆమె ‘కాజల్ ఈజ్ బ్యాక్ ఎగైన్‘ అంటూ తిరిగొస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. సరికొత్త క్రేజీ ఆఫర్స్ ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి. అది కూడా భారీ చిత్రాల్లో.. అగ్ర కథానాయకుల సరసన. ఆ మధ్య చిరు సరసన ‘ఖైదీ నంబర్ 150’ లో నటించి కమ్‌బ్యాక్ అయ్యింది. ఆ తర్వాత పలు హిట్లు కొట్టింది. కాజల్ ఇప్పుడు ఐదు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
ఇటీవలే చిరంజీవి సరసన మరోసారి నటించే ఛాన్స్ కొట్టేసిన కాజల్ .. తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్టు తెలిసింది. ‘ఇలయదళపతి’ విజయ్ సరసన మరోసారి చెయ్యబోతోంది. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా కాజల్ కథానాయికగా రూపొందిన ‘తుపాకి’ ఘన విజయాన్ని సాధించింది. విజయ్ నెక్స్ మూవీ మురుగదాస్‌తోనే ఉంటుంది. ఇది ‘తుపాకి’ సీక్వెల్ కావచ్చునట. ‘తుపాకి’ తరహాలో.. అదే హిట్ జంటని రిపీట్ చేయాలని మళ్లీ కాజల్‌నే ఎంపిక చేశారట. త్వరలోనే ఈ సినిమాని ప్రారంభించాలనుకుంటున్నారు. కాజల్ మరో క్రేజీ సీక్వెల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్.. శంకర్ క్రేజీ కాంబినేషన్ లో ‘భారతీయుడు 2’లోనూ చేస్తోంది. చిరంజీవి సరసన ‘ఆచార్య’లో నటించేందుకు కాజల్ ఓకే చెప్పింది. దీంతోపాటు మంచు విష్ణుతో కలిసి తెలుగు-ఇంగ్లీష్ చిత్రం ‘మోసగాళ్లు’, హిందీలో ‘ముంబయి సాగా’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఒకరికొకరం సాయంగా ఉంటూ…
లాక్డౌన్ వలన అనేక రంగాలకి చెందిన పరిశ్రమలు మూతపడ్డాయి.కార్మికులతో పాటు వాటిని నడుపుతున్న సంస్థలు కూడా నష్టాలలో ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న కాజల్ అగర్వాల్ దేశ ప్రజలకి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పలు సూచనలు చేసింది. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత స్థానిక వ్యాపారులకు, వ్యాపార సంస్థలకు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరింది కాజల్…
”లాక్డౌన్ పూర్తయిన తర్వాత మన దేశానికి మంచి చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మీ సెలవులన్ని ఇండియాలోనే గడపండి. బయట తినేవాళ్లు స్థానిక హోటల్స్ లో తినండి. ఇండియాలో పండించిన కూరగాయల్ని, పండ్లను కొనండి. ఇండియన్ బ్రాండ్ల షూస్, క్లోత్స్ కొని భారత్ వ్యాపారులకు సహాయం చేయండి” అని తెలిపింది. “కరోనా వలన బాగా దెబ్బ తిన్న భారత ఆర్థిక వ్యవస్థ మన సాయం లేకుండా కోలుకోవడం చాలా కష్టం. కరోనా తర్వాత కూడా మనం ఒకరికొకరం సాయంగా ఉంటూ ముందుకు సాగుదాం” అని చెప్పుకొచ్చింది కాజల్