“నాకు అవకాశాలు తగ్గిపోయాయంటే అందుకు కారణం.. గ్లామరస్ పాత్రల్లో నటించడమేన”ని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. “నేను తప్పు చేశాను. అది ఇప్పటికి తెలిసింది. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా కేవలం గ్లామర్‌కే పరిమితం అయ్యానని, ఫలితంగా.. అవకాశాలు దూరం అయ్యాయ”ని ఆవేదన వ్యక్తం చేసింది.
ఏదైనా అనుభవంలోకి వచ్చే వరకూ తెలియదంటారు. రకుల్‌ప్రీత్‌సింగ్ పరిస్థితి అంతే. తెలుగు ప్రేక్షకులను తన అందాలతో అలరించిన ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చింది. స్టార్ హీరోలందరితోనూ జత కట్టింది. అయితే,ఇప్పుడు అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. అవకాశాలు అడుగంటడానికి కారణాలు విశ్లేషించుకున్నట్టుంది. దీని గురించి మాట్లాడుతూ.. తాను వరుసగా అందాలారబోతకే ప్రాధాన్యతనిచ్చానని, అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైందని అంది. తాను ఏ దర్శక, నిర్మాతకు సమస్యలు తెచ్చి పెట్టలేదని.. పారితోషికం విషయంలో కూడా పట్టు విడుపు పాటించానని చెప్పింది. ఎవరితోనూ గొడవ పడలేదంది. షూటింగ్‌లకు టైమ్‌కు వెళ్లేదాన్నని అంది. అయినా అవకాశాలు తగ్గిపోయాయంటే అందుకు కారణం తాను గ్లామరస్‌గా నటించడమేనని పేర్కొంది. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా.. కేవలం గ్లామర్‌కే పరిమితం అయ్యానని, ఫలితం అవకాశాలు దూరం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది.
పేదవారికి తన వంతు సాయం!
రకుల్ ప్రీత్ సింగ్ పేదవారికి తన వంతు సాయాన్ని అందించడానికి సిద్ధమయ్యింది. కరోనా వైరస్ ప్రభావంతో పేద ప్రజలు..రోజువారీ కార్మికులు తిండి కోసం నానా కష్టాలు పడుతున్నారు.వారిని ఆదుకోవడానికి పలువురు సినీ తారలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేదవారికి తన వంతు సాయాన్ని అందించడానికి సిద్ధమయ్యింది. గుర్గావ్లోని తన ఇంటికి సమీపంలోని మురికివాడలోని పేద కుటుంబాలకు రోజుకు రెండు పూటల తిండిని అందిస్తున్నారు.
‘‘ప్రస్తుతం రోజుకు రెండు సార్లు భోజనం సరఫరా చేస్తున్నాం. మా ఇంటి దగ్గరలోనే ఆహారాన్ని వండి పంపుతున్నాం.లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఈ సాయం చేయాలనుకుంటున్నాం. ఒకవేళ లాక్ డౌన్ కొనసాగితే కూడా ఆహారాన్ని పంపిణీ చేస్తాం. ఎవరి భోజనం వారు తింటున్నప్పుడు వారు ముఖంలో వచ్చే చిరునవ్వు మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి. కాబట్టి నా వంతుగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నాను’’ అని చెప్పింది రకుల్.
నేనిప్పుడు శాఖాహారిగా మారాను!
ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ శాఖాహారానికి మారిందట. దీని గురించి తను తెలుపుతూ తానిప్పుడు శాఖాహారిగా మారానని..దాన్ని పాటిస్తున్నానని చెప్పింది. ముంబయిలో షూటింగ్ అయితే.. భోజనం ఇంటి నుంచే వస్తుందని చెప్పింది. శాఖాహారమే తింటానని చెప్పింది. పళ్లు, పళ్లరసం ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. ఇండియాలో ఎక్కడైనా శాఖాహారం లభిస్తుందని, విదేశాలకు వెళ్లినప్పుడే ..అది దొరకడానికి కొంత ఆలస్యం అవుతుందని చెప్పింది. అయితే యూనిట్లో ఎవరికైనా శాఖాహారం దొరికితే వాళ్లు తనకు ఇచ్చి ఆకలి తీరుస్తారని రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పుకొచ్చింది.
రకుల్‌ప్రీత్‌సింగ్ కు తమిళంలో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ‘ఇండియన్–2’ లో నటిస్తోంది. మరో చిత్రాన్ని శివకార్తికేయన్‌తో ‘అయలాన్’ చేస్తోంది. ప్రస్తుతం రకుల్ మళ్లీ అవకాశాలు దక్కించుకుంటోంది. నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న చిత్రంలో హీరోయిన్గా నటించే ఛాన్స్ రకుల్‌ను వరించిందట. అలాగే బాలీవుడ్లో కూడా రకుల్‌కు మంచి ఆఫర్ వచ్చిందట. ప్రముఖ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం రకుల్ దక్కించుకుంది. అజయ్ హీరోగా తెరకెక్కనున్న`థ్యాంక్ గాడ్` చిత్రంలో రకుల్ నటించనుందట.