‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ చిత్ర పోస్టర్లో కనిపించే మిడిల్ ఫింగర్ సీబీఎఫ్సీకి కాదని, మహిళలని పైకి ఎదగకుండా అణగదొక్కుతున్న పితృస్వామ్య సమాజానికని ఏక్తా తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)తో తమకు ఎలాంటి ఘర్షణలేదని, ఈ సమాజంతోనే అసలు సమస్య అని ఏక్తా కపూర్ అన్నారు. తమ వాణి వినకుండా గొంతునొక్కే ప్రయత్నం చేస్తూ, మహిళల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడే భావజాలం ఉన్న వారికే పోస్టర్లోని మిడిల్ ఫింగర్ …అని కుండబద్దలు కొట్టినట్టు ఏక్తా చెప్పారు. ఈ చిత్రానికి సమర్పకురాలు, డిస్ట్రిబ్యూటర్ గా ఏక్తా కపూర్ వ్యవహరిస్తున్నారు.
ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాష్ ఝా నిర్మించిన ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ చిత్ర ట్రైలర్ని మంగళవారం ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏక్తా కపూర్ తో పాటూ దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ, నటులు కొంకనా సేన్ శర్మ, రత్న పాతక్ షా, అహ్నా కుమ్రా, ప్లబితా బోర్తాకుర్ పాల్గొన్నారు.