సినీ వినోదం రేటింగ్ : 2/5
శ్రీదేవి మూవీస్, ఆదిత్యా మ్యూజిక్ పతాకాలపై .. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో .. సతీశ్ వేగేశ్న రచన,దర్శకత్వంలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధాంశం… బాలు(నందమూరి కల్యాణ్‌రామ్)కి బందువులు, బంధుత్వాలు అంటే ఇష్టం. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడంతో బాలు అనాథ అవుతాడు. బంధులందరూ అతన్ని ఒంటరివాడిని చేస్తారు. ఆ సమయంలో నాన్న స్నేహితుడు(నరేష్) అతన్ని ఆదరిస్తాడు. ఓ హాస్టల్లో చేర్చి.. ఏదైనా సహాయం కావాలంటే అడగమని చెబుతాడు. చిన్నప్పటి నుండి బాలు మనస్తత్వాన్ని ఇష్టపడ్డ నందు(మెహరీన్) అతన్ని ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోవాలని అనుకోవాలనుకుంటుంది. బాలుని ‘హీరో’ అని పిలుస్తూ.. అతనితో షార్ట్ ఫిలింస్ నిర్మిస్తుంటుంది. అయితే బాలు ఒక్కొక్కసారి కనపడకుండా పోతుంటాడు. అతని ప్రవర్తన అనుమానంగా ఉండటంతో.. నందు తన స్నేహితుల సహాయంతో ఆరా తీయిస్తే- బాలు ‘ఆల్ ఈజ్ వెల్ రిలేటివ్స్ సప్లయర్స్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేసినట్లు.. ఒంటరితనంతో బాధపడే వాళ్లకు జనాలని సప్లై చేయటమే ఈ స్టార్టప్ సంస్ద ఆశయమని తెలుస్తుంది.ఈ క్రమంలో తణికెళ్ల భరణి కుటుంబానికి కొడుకుగా వెళ్లిన బాలుకి అక్కడ లోకల్ గా సమస్యలు ఎదురౌతాయి. ఇసుక మాఫియా నడిపే గంగరాజు గంగరాజు(రాజీవ్ కనకాల)తో ఓ గొడవ అవుతుంది. వీటి వల్ల బాలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? చివరకు బాలు జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి…
విశ్లేషణ… ఇది గుజరాతీ లో పెద్ద హిట్టైన ‘ఆక్సిజన్’ అనే చిత్రానికి రీమేక్ .దర్శకుడు సతీశ్ వేగేశ్న ‘శతమానం భవతి’ లో తల్లిదండ్రులను కొడుకులు విడిచిపెట్టి విదేశాల్లోనే ఉంటే.. వారు పడే మానసిక బాధను చూపించాడు. `శ్రీనివాసకల్యాణం` లో పెళ్లి గొప్పతనాన్ని చెప్పారు… ఇందులో ఒంటిరిగా ఉండేవాళ్లు బంధాలు కావాలనుకున్నప్పుడు.. అలాంటి బంధాలను కల్పిస్తే ఎలా ఉంటుంది?..అనే ఆలోచని చెప్పాడు..’శతమానం భవతి’, ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రాల్లో లేని విలనిజాన్ని దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ సినిమాలో యాడ్ చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బావున్నా.. దాన్ని స్లో నెరేషన్లో తెరకెక్కించడంతో సినిమా చూసే ప్రేక్షకుడికి తల భారం తప్పదు. టీవి సీరియల్ చూసినట్లు సీన్స్ వచ్చి పోతూంటాయి. అలాగే కథలో పెద్దగా కాంప్లిక్…లేకపోవటంతో చాలా సీన్స్ పరమ బోర్ గా సాగుతాయి. కృష్ణవంశీ సినిమాలా ప్రతీ ఫ్రేమ్ తారాగణంతో సందడిసందడిగా ఉంటుంది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్లు పరమ రొటీన్‌గా ఉన్నాయి.ఒకే ఫీల్‌తో సినిమా అంత సాగడం.. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. సినిమాను జనరంజకంగా గా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ‘ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్ సప్లయిర్’ కాన్సెప్ట్ ఆలోచింప చేసే విధంగా ఉంది…కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం తేలిపోయింది. దర్శకుడు స్వతహాగా రైటర్ కాబట్టి డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. ఏది ఏమైనా ఇలాంటి సినిమాలను జనాలు భరించే అవకాశం తక్కువ.
నటీనటులు… ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలనే చేస్తూ వచ్చిన కల్యాణ్ రామ్ ఈ పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంలో నటించాడు. తన పాత్రకు న్యాయం చేయడానికి శ్రమించాడు. అయితే ఎమోషన్ సీన్స్ లో తేలిపోయాడు. అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనే యువతిగా మెహరీన్ మళ్లీ గ్లామర్ పాత్రలోనే నటించింది. నరేష్ ,శరత్‌బాబు, సుహాసిని, విజయ్‌కుమార్, తనికెళ్ల భరిణి,వెన్నెల కిషోర్,రాజీవ్ కనకాల, పవిత్ర లోకేష్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, సుదర్శన్, భద్రం తమ పాత్రల పరిధిమేరకు నటించారు. వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను లు కామెడీ చేద్దామని ప్రయత్నించినా…సీన్స్ కలిసిరాక, కామెడీ పండ లేదు.రాజీవ్ కనకాల విలనిజమ్ మెప్పించినా, అతన్ని విలన్ గా అంగీకరించడం కష్టమే.
సాంకేతికం… గోపీ సుందర్ పాటలు ఆకట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం ఓకే.`అర్జున్‌రెడ్డి`ఫేమ్ రాజ్ తోట ఈ చిత్రానికి మంచి ఫొటొగ్రఫీని అందించారు. ప్రతి సన్నివేశం రిచ్‌గా, నేచురల్‌గా బావుంది.యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి.తమ్మిరాజు ఎడిటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు..చాలా చోట్ల చుట్టేసిన ఫీల్ కలుగుతుంది – రాజేష్