ఈ చిత్రం తర్వాత నా ఆలోచనా ధోరణి చాలా మారిపోయింది!

‘ఛపాక్‌’ చిత్రానికి ముందు నా ఆలోచనా ధోరణి ఒక విధంగా ఉండేది. షూటింగ్‌ తర్వాత చాలా మారిపోయింది’ అని దీపికా పదుకొనె తెలిపారు . షూటింగ్‌ టైమ్‌లో నన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. స్వేచ్ఛగా చిత్రీకరణలో పాల్గొన్నా. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన ఫీలింగ్‌ కలిగింది’ అని దీపికా పదుకొనె అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఛపాక్‌’. ఢిల్లీ యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్నఈ చిత్రానికి మేఘనా గుల్జర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 10న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో దీపిక నిర్మాతగా అవతారం ఎత్తారు. ముంబైలో ‘ఛపాక్‌’ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీపికతో పాటు లక్ష్మీ అగర్వాల్‌ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ ఈ చిత్రంలోని పాట పాడుతుండగా.. స్టేజీపై ఉన్న లక్ష్మీ  కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న దీపిక ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చారు. అలాగే ఈ కార్యక్రమంలో దీపిక కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ…
‘ఛపాక్‌’ సినిమాని అంగీకరించేందుకు చాలా ఆలోచించాను. యాసిడ్‌ దాడి బాధితురాలి లుక్‌లో నేను ఎలా ఉంటాను? ప్రోస్తటిక్‌ ఎప్పుడూ వాడలేదు.. వాడితే ఎలా ఉంటుంది. ప్రేక్షకులు నన్నెలా రిసీవ్‌ చేసుకుంటారనే సందిగ్ధంలో ఉండేదాన్ని. అవన్నీ దాటుకుని ముందడుగు వేశా. షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు చాలా స్వేచ్ఛగా ఫీలయ్యాను. ఈ చిత్రానికి ముందు నా ఆలోచనా ధోరణి ఒక విధంగా ఉండేవి. షూటింగ్‌ తర్వాత చాలా మారిపోయింది” అని తెలిపారు. “ఇది కేవలం లక్ష్మీ బయోపిక్‌ మాత్రమే కాదు. ఆమె ప్రయాణం, పోరాటం​, విజయం, మానవ ఆత్మకథ”…అని అన్నారు.
మంచి పనిచేశాను అనిపిస్తుంది !
దీపికా పదుకొనే.. ప్రస్తుతం తన సినిమా ‘చపాక్‌’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఓ ప్రముఖ చానల్‌లో ప్రసారమవుతున్న డ్యాన్స్‌ రియాలిటీ షోకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ షో కంటెస్టెంట్లు దీపికను సర్‌ప్రైజ్‌ చేశారు. దీపిక నటించిన సినిమాల్లో హిట్‌గా నిలిచిన పాటలకు.. ఆమె స్టైల్లోనే డ్యాన్స్‌ చేసి ఆమెకు మధురానుభూతిని మిగిల్చారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్‌’ సినిమాల్లోని దీపిక పాటలకు నర్తించి ఆమెపై అభిమానాన్ని చాటుకున్నారు. వారి ప్రేమకు పొంగిపోయిన దీపిక భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపై కన్నీళ్లు పెట్టుకుని.. వారికి ధన్యవాదాలు తెలిపారు.
“నా సినిమా ప్రస్థానం గురించి నేను ఏనాడు ఆలోచించలేదు. పనిచేసుకుంటూ వెళ్తున్నాను అంతే. అయితే, ఈరోజు నా సినీ ప్రయాణాన్ని కళ్లారా చూసే అవకాశం దక్కింది. అందరికీ వినోదాన్ని అందించే రంగంలోకి వచ్చి.. మంచి పనిచేశాను అనిపిస్తుంది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. దీపిక.. అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో డిప్రెషన్‌కు లోనైనప్పటికీ.. తిరిగి కోలుకుని కెరీర్‌పై దృష్టిసారించారు. హాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకుని ఒక స్థాయిని సంపాయించుకున్నారు .
 
దీపిక గతేడాది తన చిరకాల స్నేహితుడు రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమాల విషయానికొస్తే.. మరోవైపు ’83’లో నటిస్తున్న దీపికా త్వరలో ద్రౌపదిగా మారబోతుందట. నితీష్‌ తివారీ దర్శకత్వంలో మధు మంతెన ‘మహాభారతం’ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో కృష్ణుడిగా హృతిక్‌ రోషన్‌, ద్రౌపదిగా దీపికాని ఎంపిక చేసినట్టు సమాచారం.