“నిన్న కంటే నేడు ఇంకా కొంచెం ఎక్కువగా శ్రమించాలి. అందుకోసం మనం మనతోనే పోటీ పడాలి. ఇప్పుడు నేనదే చేస్తున్నాను”…అని అంటోంది రాశీఖన్నా
రాశీఖన్నా నటించిన ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’ మంచి విజయాన్ని సాధించాయి.. దీంతో మంచి హుషారు మీదున్న రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ… ” మనం ఒక్కో రోజూ ఇంకా మంచి మనిషిగా మారడానికి ప్రయత్నించాలి. నిన్న కంటే నేడు ఇంకాస్తా ఎక్కువగా శ్రమించాలి. అందుకోసం మనం మనతోనే పోటీ పడాలి. ఇప్పుడు నేనదే చేస్తున్నాను. నటిగా పరిచయమై ఏడేళ్లు అయ్యింది. వివిధ కథా పాత్రల్లో నటించాను. నా జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నా నిర్ణయాలను కూడా చాలా మార్చుకున్నాను. నేను పోషించిన పాత్రలు నాపై ప్రభావం చూపాయి. నా ఆలోచనా పరిధి పెరిగింది. సినిమాల్లో జయాపజయాలు సహజం. ఇంతకు ముందు విమర్శలపై వెంటనే రియాక్ట్ అయ్యేదాన్ని. నా చిత్రాల అపజయాల గురించి ఎవరైనా విమర్శించినా, గాసిప్స్ రాసినా కోపం వచ్చేది..ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయ్యింది. చాలా శాంతస్వభావిగా మారిపోయాను. నిన్నటి కంటే నేడు బాగుండాలని ప్రయత్నిస్తున్నాను.ఈ కొత్త సంవత్సరంలో నా ఈ ప్రయత్నం కొనసాగుతుంది”… అని రాశీఖన్నా పేర్కొంది.
దేనికీ తొందరపడాల్సిన పనిలేదు!
పండ్లు, కాయగూరలు, ఉడికించిన చేపలు మాత్రమే ఏడాదికి పైగా తిన్నా. ఫలితం లేదు. పైగా హార్మోనల్ ఇబ్బందులు వచ్చేశాయి. తగ్గడానికి బదులు పెరగసాగా. దాంతో విసిగిపోయా. బరువు తగ్గడానికి ఎన్ని రకాల డైటింగ్లు చేశానో .‘అరే… ఇన్ని చేస్తున్నా ఎందుకు తగ్గడం లేదు’ అని చిరాకు వచ్చేసేది’… అంటూ చెప్పింది రాశీఖన్నా. ఆమె ఒకప్పుడు బాగా లావుగా ఉండేది. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంది. బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నాల గురించి చెబుతూ…
“ఫ్రెండ్ ఒకరు ‘హిమాలయాల్లో ఆనందాశ్రమం ఉంది. ఒకసారి అక్కడికి వెళ్లు. బావుంటుంది’ అని చెప్పారు . అది కూడా ట్రై చేద్దామని వెళ్లా. వాళ్లు నా శరీరతత్వాన్ని గురించి చెప్పారు. నాది ‘కఫ’ తత్వం అన్నారు. ఏం తినాలో, ఏం తినకూడదో చెప్పారు. మెడిటేషన్ నేర్పించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ‘ఏదీ రాత్రికి రాత్రే జరగదు’ అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పారు. ‘ఓపిగ్గా వేచి చూడటం ఎలా’ అనేది నా జీవితంలో తొలిసారి నేను అక్కడే నేర్చుకున్నా. తిరిగి వచ్చాక ట్రైనర్ కులదీప్ పరిచయమయ్యాడు. ప్రతి రోజూ ఉదయం, రాత్రి జిమ్ చేయించాడు. వెయిట్‌లాస్ ‘డైటింగ్’ వల్ల జరగదని చెప్పాడు. అదే సమయంలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువయ్యాయి. ‘థైరాయిడ్ అనేది కేవలం శరీరానికి సంబంధించిందే కాదు. మనస్సుకు సంబంధించింది. మీరు ప్రశాంతంగా ఉండనంత కాలం ఫలితాల్లో మార్పు రాదు’ అని డాక్టర్లు అన్నారు. మళ్లీ ఇంకోసారి హిమాలయాలకు వెళ్లా. ఈసారి నన్ను నేను మరింత అర్థం చేసుకున్నా. ‘దేనికీ తొందరపడాల్సిన పనిలేదు. నా పనిని నేను సక్రమంగా చేస్తే చాలు’ అని స్పష్టంగా అర్థమైంది. అప్పటి నుంచి రోజుకు రెండు పూటలా జిమ్.. ఉదయాన్నే మెడిటేషన్, యోగా చేసాను. ధ్యానంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మన పరిసరాలు ఎంతో సహకరిస్తాయి. ఆ విషయాన్ని నేను ప్రత్యక్షంగా గమనించా. మనలో చాలా మంది పట్టించుకోరు గానీ, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకం…అంటూ చెప్పింది రాశీఖన్నా