రజనీకాంత్ తన సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు. త్వరలో రాజకీయాలలోకి వస్తారన్న రజనీ..తన సినిమాలని మాత్రం ఆపడం లేదు. రజనీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్భార్’ సినిమా చేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది . ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘విశ్వాసం’ ఫేమ్ శివ దర్శకత్వంలో రజనీకాంత్ తన 168వ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో చేయనున్నారు. డిసెంబర్ 5న ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. కీర్తి సురేష్, జ్యోతిక కథానాయికలుగా నటించనున్న ఈ చిత్రానికి పేరు ఇంకా పెట్టలేదు. మరో వైపు రజనీకాంత్ 169వ చిత్రంకి సంబంధించి తాజాగా ఓ వార్త కోలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది . రజనీకాంత్ ప్రధాన పాత్రలో తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. ఆయన టేకింగ్ స్టైల్‌తో..కథ కూడా రజనీకి నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావాలి .
రజినీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయం
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) వేడుకలు గోవాలో ఈ నెల 28 వరకు జరిగాయి. ఈగోల్డెన్ జూబ్లీ వేడుకల్లో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, అమితాబ్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రోత్సవంలో రజినీకాంత్‌కు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా `ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి`అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును తనతో పనిచేసిన దర్శక నిర్మాతలకు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అంకితమిస్తున్నట్లు.. రజినీ తెలిపారు.
ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ..`రజినీకాంత్‌ని నా కుటుంబ సభ్యుడిగా భావిస్తాను. ఒకరికొకరు సలహాలను ఇచ్చుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ సలహాలను పాటించం. రజినీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయం`అన్నారు.
సోషల్ మీడియాలో ‘దుమ్ము..దూళి’
రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘దర్బార్’.. ఫస్ట్ సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసారు. తమిళ్, తెలుగు, హిందీలో కూడా ఈ పాట విడుదల అయింది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎస్పీ బాలు పాడిన ఈ పాటను తెలుగులో అనంత్ శ్రీరామ్ రాశారు. తెలుగులో ‘దుమ్ము.. దూళి’ అని సాగే ఈ పాట.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చూస్తున్నారు. రజినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్.. ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలంగా కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత రజినీ పోలీసు అధికారిగా కనిపిస్తున్న చిత్రం ఇదే. నయనతార కథానాయికగా నటించారు. రజనీకాంత్ కూతురిగా నివేథా దామస్ నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘దర్బార్’ జనవరి 9న విడుదల కానుంది.