“ఈ సూపర్ స్టార్ జీవితంలో చాలా ఎత్తుపల్లాలు,ఆటుపోట్లున్నాయి. ఇప్పుడు అతను చేస్తున్న చిత్రాలన్నీ వరుసగా విజయం సాధిస్తున్నాయి. అయితే .. ఒక దశలో ఏకంగా అతను చేసిన 14 చిత్రాలు నిరాదరణకు గురయ్యాయి. సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుందా? లేక తిరస్కరణకు గురవుతుందా? అన్నది చాలా విషయాల పై ఆధారపడి ఉంటుంది. పరాజయ ప్రభావం మాత్రం అందులో చేసిన వ్యక్తులపై ఉంటుంది. తట్టుకోవడం కష్టమే. అపజయాలు వరుసగా 14 సార్లు వస్తే…ఆ ఓటమిని ఎదుర్కోవాలంటే ఎంత ధైర్యముండాలి?. థామస్ ఎడిషన్‌లా గెలుస్తామన్న దృఢమైన విశ్వాసమైనా ఉండాలి… ఎన్ని అపజయాలు వచ్చినా..ఖచ్చితంగా గెలుస్తామనే గట్టి నమ్మకమైనా మనసులో బలంగా ఏర్పడాలి.
బాలీవుడ్ సూపర్ హీరో అక్షయ్ కుమార్‌కి ఇటువంటి పరిస్థితే గతంలో ఎదురైంది. నటుడిగా మూడు దశాబ్దాలు పూర్తిచేసుకోబోతున్న అక్షయ్ కెరీర్ వెనుక చాలా ఆటుపోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేస్తున్న చిత్రాలన్నీ వరుస విజయం సాధిస్తున్నా.. ఓ దశలో ఏకంగా అక్షయ్ 14 చిత్రాలు ప్రేక్షక నిరాదరణకు గురయ్యాయి. బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి .ఇన్ని ఫ్లాప్‌లిచ్చిన నటుడితో ఎవరైనా సినిమా చేసేందుకు ముందుకొస్తారా? అటువంటి పరిస్థితి అక్షయ్ కి ఎదురైనప్పుడు..కెరీర్ ఇక ముగిసిపోయినట్టే..సినిమాలకు స్వస్తి చెప్పాల్సి వస్తుందని అనుకున్నాడు.
”అపజయాలను నేను ఎదుర్కొని మళ్లీ ఈ స్థాయికి రావడానికి కారణం మార్షల్ ఆర్ట్స్. నాకు వరుస ఫ్లాప్‌లు వచ్చినప్పుడు.. నా కెరీర్ ఇక ముగిసిపోయినట్టే అనుకున్నా. చాలా బాధపడ్డా. కానీ అపజయాలను నేను ఎదుర్కొని మళ్లీ ఈ స్థాయికి రావడానికి కారణం మార్షల్ ఆర్ట్స్. మార్షల్ శిక్షణే నా గుండెల్లో ధైర్యాన్ని నింపి.. నాకు క్రమశిక్షణను బోధించింది. వైఫల్యాలను అనుభవాలుగా ఎలా మలుచుకోవాలో నేర్పింది. అందువల్ల ఫ్లాప్స్ నుండి నేను నేర్చుకున్న పాఠాలే ఈ రోజు హిట్స్ వచ్చేలా చేశాయి” అని చెప్పారు అక్షయ్.కెరీర్ ప్రారంభంలో అక్షయ్ మార్షల్ ఆర్ట్స్‌తో యాక్షన్ చిత్రాలే చేసేవారు. అందుకే ‘ఖిల్లాడి’ అనే పేరొచ్చింది. ఆ తర్వాత అన్ని జోనర్లలోనూ… ‘ఫెరి’, ‘వెల్‌కమ్’ వంటి కామెడీ చిత్రాలు, క్రైమ్ థిల్లర్ ‘రుస్తుమ్’ వంటి ఎవర్‌గ్రీన్ మూవీలు.. సామాజిక నేపథ్యం ఉన్న ‘ప్యాడ్‌మ్యాన్’, ‘టాయిలెట్’, ఏక్ ప్రేమ్ కథ’ చేశారు. విభిన్నమైన ‘మిషన్ మంగళ్’లో..ఇటీవల కామెడీ ‘హౌస్‌ఫుల్ 4’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి..
అక్షయ్ కి వందకోట్లు రెమ్యూనరేషన్
బాలీవుడ్‌లో ఖాన్ త్రయం సల్మాన్, అమిర్, షారూఖ్ ఖాన్‌లు..సౌత్ లో రజనీకాంత్, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, చిరంజీవి, మహేష్‌బాబు.. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోలు. వీరికి షాక్ ఇవ్వబోతున్నారు అక్షయ్ కుమార్. తాజాగా ఆయనకు వంద కోట్ల ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం ‘గుడ్‌న్యూస్’, ‘లక్ష్మిబాంబ్’, ‘సూర్యవంశీ’ చిత్రాల్లో నటిస్తున్న అక్షయ్ ..తనకు ‘ఎయిర్‌లిఫ్ట్’ వంటి సూపర్ హిట్‌ని అందించిన నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వాసు భగ్నాని దీన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుందట. ఓ రియల్ లైఫ్ సంఘటన నేపథ్యంలో తెరకెక్కే ఈ భారీ యాక్షన్ డ్రామాకి ఆశ్చర్యకరమైన రీతిలో నిర్మాతలు అక్షయ్ కి వందకోట్లు రెమ్యూనరేషన్‌గా ఆఫర్ చేశారట. ఇదే గనుక నిజం అయితే …ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా అక్షయ్ అవుతారు.