‘ఫెస్టివల్ చేయడం కంటే కూడా చిల్డ్రన్ ఫిల్మ్స్‌ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది’…. అని అన్నారు గతంలో ఈ ఫెస్టివల్ ఛైర్మన్‌గా వ్యవహరించిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ‘అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం’ రెండు సంవత్సరాలకొకసారి హైదరాబాద్‌లో నిర్వహించాలి. అయితే ఈ ఏడాది జరగాల్సిన చిత్రోత్సవం వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనికి ప్రభుత్వం అనేక కారణాలు చెబుతోంది. వర్షాలు ఎక్కువ పడ్డాయని, అధికారులంతా చాలా బిజీగా ఉన్నారని, మరోవైపు ఎన్నికలు కూడా ఉన్నాయని.. అందుకే వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రభుత్వం కారణాలు చూపెడుతోంది. అయితే వాస్తవానికి చిల్డ్రన్ ఫిలింఫెస్టివల్ జరగకపోవడానికి గల అసలైన కారణాలు ఏమై ఉంటాయి? ప్రభుత్వం చెబుతున్న కారణాలు నిజమేనా? అని తమ్మారెడ్డి భరద్వాజను అడిగితే …
డబ్బులు వేస్ట్ చేయడానికి ఫెస్టివల్ ఎందుకు?
‘‘ఈ ఫెస్టివల్ జరగకపోవడానికి కారణాలు నిజంగా నాకు తెలియదు కానీ, ఒక రకంగా మాత్రం సంతోషంగా ఉంది. ఎందుకంటే.. ‘చిల్డ్రన్ ఫిలింఫెస్టివల్’ కి హైదరాబాద్ పర్మినెంట్ వెన్యూ అంటారు, హెడ్ ఆఫీస్ అంటారు.. కానీ ఇక్కడెవరూ ఉండరు. ఈ ఫెస్టివల్ కి .. తెలంగాణ గవర్నమెంట్ కానీ.. ఇంతకుముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కొంత డబ్బు కేటాయిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ కేటాయిస్తుంది. ఈ వేడుక కోసం ఢిల్లీ నుంచి దాదాపు వంద మందికి పైగా వస్తారు. హెడ్ ఆఫీస్ ఇక్కడున్నా కానీ… ఎవ్వరూ ఇక్కడ ఉండి పనిచేయరు. వాళ్లు ఇక్కడకు వచ్చి, హోటళ్లలో ఉండి, కార్లలో తిరగడానికే ఆ డబ్బు సరిపోతుంది. అలా డబ్బులు వేస్ట్ చేయడానికి ఇక్కడ ఫెస్టివల్ ఎందుకు? హైదరాబాద్‌లో ఇప్పటి వరకు పది సార్లు ఈ వేడుకలు జరిగాయి. 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అప్పటినుండి వేదికను ఎందుకు మార్చుకోలేకపోయారు? ఒకానొక టైమ్‌లో ఫిల్మ్‌నగర్‌లో వీరి ఆఫీస్ కోసం గవర్నమెంట్ స్థలం కూడా కేటాయించింది. కానీ వారు తీసుకోలేదు. వారికి అసలు గౌరవం లేదు… ఇక్కడి గవర్నమెంట్ అన్నా, ప్రజలన్నా, నటులన్నా గౌరవం లేదు. గౌరవం లేనివాళ్లు ఇక్కడకు రావడం కంటే.. బయటికి పోవడం మంచిది అని నా అభిప్రాయం.
నార్త్, సౌత్ వివక్ష ఎక్కువగా చూపిస్తున్నారు!
చిత్రోత్సవం వాయిదా గురించి తెలంగాణా ప్రభుత్వం చెబుతున్న కారణాల విషయం చూస్తే … నాకు తెలిసి ఈ వేడుకకు మనం చేసే పని చాలా తక్కువ. మొత్తం ఎఫ్.డి.సి.నే చూసుకుంటుంది. ఎఫ్.డి.సి.తో పాటు నాలాంటి వాళ్లు కొందరు పాల్గొంటారు. గవర్నమెంట్ చెబుతున్న.. ఎలక్షన్లలో బిజీగా ఉండేవాళ్లు ఎవ్వరూ ఈ ఫెస్టివల్‌కు పనికొచ్చేవాళ్లు కారు. మరి వాళ్లు ఎందుకు అలా చెబుతున్నారో నాకు తెలియదు. ఏం ఉన్నా కానీ, ఈ ఫెస్టివల్ చేసుకోవచ్చు. కానీ గౌరవంలేనిది.. ఇక్కడ చేయడం కంటే చేయకపోవడమే మంచిది అనేది నా ఫీలింగ్. నార్త్, సౌత్ అనే వివక్షతను ఎక్కువగా చూపిస్తున్నారు కాబట్టే.. మన స్టార్స్ కూడా ఈ ఫెస్టివల్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కిందటి సారి నందితాదాస్ మాత్రం అందరినీ కలుపుకుని వెళ్లడానికి ట్రై చేశారు.మిగిలినవారు అసలు ట్రై చేయలేదు.వారెవరూ మనవాళ్లని మనుషుల్ని చూసినట్టుగా కూడా చూడలేదు. ‘మేము ఇట్లాగే చేస్తాం’ అంటూ వాళ్ల మొండివైఖరి ప్రదర్శిస్తారు. అందుకే మనవాళ్లంతా వాళ్లకి వ్యతిరేకం అయిపోయారు.వర్షాలు అనేది కారణమే కాదు. వర్షాకాలం వర్షాలు పడకుండా ఎలా ఉంటాయి? మొదటిసారి ఇక్కడ ఫిలిం ఫెస్టివల్ జరిగేటప్పుడు వర్షం పడుతూనే ఉంది. జయభాదురి, ఎన్టీఆర్ వర్షంలోనే ఈ ఫెస్టివల్ నిర్వహించారు. ఎవ్వరూ ఒక్కరూ కూడా వర్షం అని వెళ్లలేదు. అందరూ వర్షంలో నిలబడే ఆ ఫెస్టివల్ నిర్వహించారు. సో.. వర్షంతోనే ఈ ఫెస్టివల్ స్టార్టయింది.
చిల్డ్రన్ ఫిల్మ్స్‌ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది !
నవంబర్ 14, నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జరగాల్సిన ఈ ఫెస్టివల్ గ్లామరస్ ప్రాజెక్ట్ కాదు. అందుకే హైదరాబాద్ కు పంపించారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌ని తీసుకెళ్లి గోవాలో పెట్టారు. అలాగే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటున్నాం కానీ, పిల్లల చిత్రాలను ఎంకరేజ్ చేసే పని మాత్రం చేయడం లేదు. పిల్లల చిత్రాలను పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏనుగు బొమ్మను చూపించి ఏదో హడావుడి చేయడం తప్ప.. చేసేదేం లేదు. ఫెస్టివల్ చేయడం కంటే కూడా చిల్డ్రన్ ఫిల్మ్స్‌ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అలాగే పిల్లలను బలవంతంగా తీసుకురావడం కాకుండా, వాళ్లు ఇష్టపడేలా చేసి.. ఇటువంటి ఫెస్టివల్‌కి తీసుకురావాలి. ప్రభుత్వాలు కూడా సహకరించాలి. పిల్లల్లో నిజంగా ఆసక్తి తీసుకురాగలితే ఈ ఫెస్టివల్‌కు ఓ సార్థకత ఉంటుంది..’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.