‘దర్శకరత్న’ దాసరి పేరిట ‘రాక్ స్టార్ ఈవెంట్స్’ ,‘కింగ్ మీడియా ఈవెంట్స్’ సంయుక్తంగా ప్రతి యేటా అవార్డ్స్‌ను ప్రదానం చేయనున్నారు. ఎన్ఆర్ఐలు జై శంకర్, కళ్యాణ్, సాయి ప్రసాద్ యండమూరి, నాగరాజు, నవీన్, వారి స్నేహితులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్టోబర్ 26న శిల్పకళావేదికలో ‘దాసరి అవార్డ్స్’ అందజేస్తారు.దాని బ్రోచర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ,రేలంగి నరసింహారావులు విడుదల చేశారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ… ‘‘దర్శకరత్న మా గురువుగారు స్వర్గీయ దాసరి నారాయణరావుగారు మరణించినా ఇప్పటికీ ఆయనకు అభిమానులు ఉండటం అనేది గర్వించదగ్గ విషయం. ఆయన పేరిట అవార్డ్స్‌ను ఇవ్వడం ఇంకా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 26న శిల్పకళా వేదికలో జరుపుతామని ఎన్ఆర్ఐలు జై శంకర్, కళ్యాణ్‌లు తెలిపారు.అక్టోబర్ 25న మా గురువుగారి సతీమణి స్వర్గీయ దాసరి పద్మగారి జయంతి కనుక… ఆ రోజున ఈ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిపితే బాగుంటుంది. మా గురువు దాసరిగారికి రెండు కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం.ఒకటి.. ప్రతి నెలా పేద ఆర్టిస్టులకు చెక్కులు ఇవ్వడం. రెండవది.. ప్రతియేటా మే 4న తన పుట్టిన రోజున పేద విద్యార్థులకు ఆర్థికసహాయం అందించడం . దీనిని ఆయన బాధ్యతగా భావించేవారు. ఆ కార్యక్రమాలను కూడా కళ్యాణ్, నాగరాజు, జై శంకర్ మిత్రులు ప్రతి యేటా నిర్వహిస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు.
ఈ సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్గనైజర్లు జై శంకర్, కళ్యాణ్, సాయి ప్రసాద్ యండమూరి, నాగరాజు, నవీన్‌లు పాల్గొన్నారు.