అమీర్‌ఖాన్ తాను పోషించే పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు . “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” పరాజయంతో విరామం తీసుకున్న అమీర్ తాజాగా ‘లాల్‌సింగ్ చద్ధా’ చిత్రంలో నటిస్తున్నారు. 1994లో యాక్షన్ హీరో టామ్ హంక్స్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచిన వ్యక్తి కధతో రూపొందనున్న ఈ చిత్రంలో అమీర్‌ఖాన్ యువకుడిగా కనిపించనున్నారట. దీని కోసం దాదాపు 20 కిలోల బరువు తగ్గారని తెలిసింది. ప్రత్యేక డైట్‌ని ఫాలో అవుతూ లాల్‌సింగ్ చద్దా పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ అమీర్ మార్పులు చేర్పులు సూచిస్తూ ఎక్కడా ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దొర్లకుండా చూస్తున్నారు. ప్రీప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో ప్రారంభిస్తారు. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వయాకమ్ 18 పిక్చర్స్‌తో కలిసి అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
ఆరోపణలున్న వ్యక్తితో కలిసి సినిమా
అమిర్ ఖాన్ బాలీవుడ్‌లో ‘మీటూ’ ఉద్యమం బలంగా ఉన్నప్పుడు ఆ పోరాటానికి బహిరంగ మద్దతు తెలిపారు. అయితే అప్పుడు మీటూకు మద్దతు తెలిపిన వ్యక్తి.. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తితో కలిసి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తుల్లో దర్శకుడు సుభాష్ కపూర్ ఒకరు. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ సమయంలో ఆ సినిమా దర్శకుడు సుభాష్ కపూర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. ఆరోపణలు తేలేవరకూ అతనితో పనిచేయలేనని అప్పట్లో అక్షయ్ కుమార్ అన్నారు. తనుశ్రీ దత్ వంటి వారు మహిళలకు రక్షణ లేకుండా చేస్తారా..కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ…ఈ వృత్తికి దూరం అయ్యేలా చేస్తున్నారా? అంటూ అమిర్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించినా అమిర్ వెనక్కు తగ్గలేదు. ‘నేరం నిరూపితం కానంత వరకూ అతన్ని నేరస్తుడిగా భావించలేం’ అంటూ ఆ విమర్శలకు సమాధానం చెబుతూ.. సుభాష్ కపూర్‌తో సినిమా చేయడాన్ని సమర్థించుకున్నారు అమిర్. సుభాష్ కపూర్ కాంబినేషన్‌లో అమిర్ కొత్త చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రానికి ‘మొగల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘టీ సిరీస్’ గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. అమిర్ ఖాన్ గుల్షన్ కుమార్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 15వ తేదీన నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.