రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ఖాయం అయ్యిందంటున్నారు . పార్టీ ఏర్పాటుకు ఆయన నిర్ణయం తీసుకున్నారా? ఇక ప్రకటించడమే మిగిలిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. కోలీవుడ్‌లోని విశ్వసనీయ వర్గాలు చెప్పే ప్రకారం రజనీకాంత్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే … ఆయన జన్మదినమైన డిసెంబరు 12న ఆయన కొత్త పార్టీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయన కొంతమంది ప్రముఖులతో చర్చించారని తెలిసింది.ఇప్పటికే చిన్నాచితకా తమిళ పార్టీలు రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తుండగా … పెద్ద పార్టీలు మాత్రం ఆయన రాకను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇటీవల రజనీ తన అభిమానులతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఆ సమయంలో ‘యుద్ధం వచ్చినప్పుడు చూద్దాం. సిద్ధంగా ఉండండి’ అంటూ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఆయన రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవ్వడం వల్లనే … అలాంటి ప్రకటన చేశారని పలు వర్గాలు విశ్లేషించాయి. బీజేపీ అయితే తమ పార్టీలో చేరాలంటూ బహిరంగంగానే పిలుపునిచ్చింది. అంతేగాక ఆ పార్టీకి చెందిన నేతలు సైతం రజనీని కలిసి మాట్లాడారు. రజనీ పార్టీ ప్రారంభించేందుకే సిద్ధమవుతున్నారు. అందుకే ఆయన హడావుడిగా ‘కాలా’, ‘2.0’ సినిమాలను పూర్తి చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. డిసెంబరు లోపు ఈ రెండు సినిమాలను విడుదల చేసి ఆ నెల 12వ తేదీన తన జన్మదినం నాడు పార్టీ ప్రారంభించేందుకు రజనీ సన్నాహాలు చేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.