ఆ రిలేషన్‌షిప్‌ వల్లనే నా డిప్రెషన్‌ !

ఇటీవల బెంగళూరులో ఆండ్రియా తన కవితల పుస్తకం ‘బ్రోకెన్‌ వింగ్స్‌’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందులోని భావోద్వేగమైన కవితను ఆమె చదివి వినిపించారు. ఈ సందర్భంగా శ్రోతలు ఆమె కవితలోని పలు బాధాత్మక పంక్తులను గురించి ప్రశ్నించారు.దీనికి ఆండ్రియా సమాధానమిస్తూ.. తాను కొంతకాలం ఓ వివాహితుడితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అతను తనను మానసికంగా, శారీరకంగా వేధించి..గాయపర్చాడని, అందుకే తాను డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు చెప్పారు. ఈ డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి సినిమాలకు దూరంగా ఉంటూ.. ఆయుర్వేద చికిత్స పొందానని ఆమె తెలిపినట్లు ఒక ప్రముఖ వెబ్‌సైట్‌ ఓ కథనంలో పేర్కొంది. తన కవితల ద్వారా వ్యక్తిగత భావాలను వెల్లడించానని, ఇలా వెల్లడించడానికి ఎంతో ధైర్యం కావాలని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బ్రోకెన్‌ వింగ్స్‌’ కవర్‌ పేజీ పోస్టు చేస్తూ.. ఆండ్రియా పేర్కొన్నారు.
 
సమస్యల నుంచి విముక్తి పొందడానికి
కొంత కాలం తాను సినిమాలకు దూరమయిన మాట నిజమే అంటోంది హీరోయిన్‌ ఆండ్రియా. ఇందుకు కారణం ‘విశ్రాంతి లేకుండా నటించడంతో శారీరకంగానూ, మానసికంగానూ చాలా అలసిపోయాను’.. అనడం కంటే బాధకు గురయ్యానని అంటోంది. ఆండ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. విశ్వరూపం తో సహా చేసిన బహుభాషా నటి. అంతే కాకుండా చాలా స్వేచ్చా మనస్తత్వం కలిగిన నటి. తాను చేయాలనుకున్నది ఎవరేమనుకున్నా ‘డోంట్‌కేర్‌’ అని చేసేస్తుంది. అలా ఆ మధ్య వివాదాస్పద సంఘటనలతో వార్తల్లోకెక్కిన ఆండ్రియా ఇటీవల ఇమేజ్‌ను పట్టించుకోకుండా ‘వడచెన్నై’ చిత్రంలో సంచలన పాత్రను పోషించింది. అలా ఏడాదికి నాలుగైదు చిత్రాల్లో నటించే ఈ బ్యూటీ ఇటీవల తెరపై కనిపించలేదు. గత ఏడాది ఈ అమ్మడు నటించిన ‘విశ్వరూపం 2’, ‘వడచెన్నై’ చిత్రాలు మాత్రమే తెరపైకి వచ్చాయి. ఆ తరువాత ఆండ్రియా మరో చిత్రంలో నటించలేదు.ఇక సామాజిక మాధ్యమాల్లో తరుచూ తన అభిప్రాయాలను, ఫొటోలను పోస్ట్‌ చేసే ఆండ్రియా ఇటీవల అలాంటి వాటికి దూరంగా ఉంది.
దీంతో ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పిందా? అనే అనుమానం కలిగింది. దీంతో ఎట్టకేలకు ఆండ్రియా తన ట్విట్టర్‌లో.. తాను సినిమాలకు దూరంగా ఉండడానికి కారణాన్ని వెల్లడించింది. తాను విశ్రాంతి లేకుండా నటించడం కారణంగా మానసికంగానూ, శారీరకంగానూ చాలా బాధకు గురైనట్లు చెప్పింది. అందుకే కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నానని చెప్పింది. కాఫీ తాగడానికి బానిసనైన తాను దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స పొందినట్లు తెలిపింది. అయితే అది అంత సాధ్యం కాలేదని అయినా వైద్య చికిత్సతో కష్టపడి ఆ అలవాటును మానుకున్నానని చెప్పింది. కాఫీకి బదులు ఉదయాన్నే ఒక కప్పు మూలిక తేనీరును తీసుకుంటూ, యోగాతో దిన చర్యలను ప్రారంభిస్తున్నానని తెలిపింది. అయితే ఆ వైద్యాన్ని బలహీన హృదయం కలవారు పాటించలేరని చెప్పింది. తానే ఒక దశలో ఆ వైద్యం నుంచి బయట పడాలని భావించానని అంది. అయితే వైద్యుల సలహా మేరకు ఆయుర్వేద వైద్య చికిత్సను కొనసాగించినట్లు తెలిపింది. తానుఇప్పుడు నూతనోత్సాహంతో ఉన్నట్లు చెప్పింది.