“ఎంత రాత్రయినా, ఎంత అలసిపోయినా కాసేపు న్యూస్ ఛానెల్స్ చూస్తాను. దానివల్ల సమాజంలో ఏం జరుగుతోందో తెలుస్తుంది”…..అని అంటోంది కాజల్. “పనిలో పడితే ఇంకేమీ గుర్తుండదని చెప్పేవాళ్లని చూస్తూనే ఉంటాం. కథా నాయిక కాజల్ మాత్రం ఎన్ని పనులున్నా సరే.. చేయాలనుకున్నవి అస్సలు మరిచిపోను అంటోంది. తమిళం, తెలుగు చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్ ప్రస్తుతం కమల్‌హసన్ సరసన ‘ఇండియన్2’, హిందీ ‘క్వీన్’ రీమేక్ ‘పారిస్ పారిస్’, జయం రవికి జోడీగా ‘కోమాలి’, తెలుగులో ‘రణరంగం’ చిత్రాల్లో నటిస్తోంది.
‘బిజీ జీవితం వల్ల కోల్పోయింది ఏమైనా ఉందా?’ అని అడిగితే… ‘‘చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పట్నుంచి విరామం లేకుండా పనిచేస్తున్నా. చిత్రీకరణ, ప్రచారం, కథలు వినడం ఇలా సమయమంతా గడిచి పోతుంది. అయితే ఎన్ని పనులున్నా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం మాత్రం మరిచిపోను. ఎంత రాత్రయినా, ఎంత అలసిపోయినా కాసేపు న్యూస్ ఛానెల్స్ చూస్తాను. దానివల్ల సమాజంలో ఏం జరుగుతోందో తెలుస్తుంది. పనులు చేస్తున్నామని, వాటిలో పడి వ్యక్తిగా మనం ఎదగడం మరిచి పోకూడదు. సినిమా లేకుండా నన్ను నేను ఊహించుకోలేనేమో కానీ, సినిమానే జీవితం కాదని తెలుసు. అందుకే సమాజంలోని సగటు వ్యక్తిగా నేనేం తెలుసుకోవాలో అవి తెలుసుకొని, ఏం చేయాలో అది చేస్తుంటా’’ అని చెప్పింది కాజల్.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో వెబ్ సిరీస్
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న వెబ్ సిరీస్‌లో గ్లామరస్ తార కాజల్ అగర్వాల్ నటించనున్నట్టు కోలీవుడ్ వర్గాల నమాచారం. మొత్తం పది భాగాలుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం. ఇటీవల కాలంలో పలువురు తారలు సినిమాల కంటే… వెబ్‌సిరీస్ లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సెన్సార్ సమస్యలు లేకపోవడంతో తమ మనసులో వున్న కథను యధాతథంగా తెరకెక్కించేందుకు ఆస్కారం వుండడంతో ఎక్కువమంది దర్శకులు ఆ వెబ్‌సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.