‘అంతిమ ఫలితం కోసం వెయిట్ చేస్తే, చేసే విధానంపై దృష్టి పెట్టలేం. అలాగని కేవలం చేసే విధానంపై మాత్రమే దృష్టి పెడితే అనుకున్న స్థానానికి చేరుకోలేం. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలి’ అని అంటోంది కత్రినా కైఫ్. ఆమె నటించిన ‘భారత్’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా పయనిస్తోంది. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా మెరిసిన విషయం విదితమే. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని తన పాత్రకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయట. ఆ ఆనందాన్ని కత్రినా మీడియాతో పంచుకుంది….
‘మనకు గోల్ ఎంత ముఖ్యమో, వెళ్ళే దారి కూడా అంతే ముఖ్యం. రెండింటిని సరిగా చూసుకుంటూ ముందుకు సాగాలి. ప్రశంసలు ఆనందాన్నిస్తాయి. విమర్శలు మన లోపాలను తెలియజేస్తాయి. మనల్ని తట్టిలేపుతాయి. కానీ అంతిమ న్యాయం అనేది ఎప్పుడూ మారదు.‘భారత్’ సినిమా విషయంలో నా పాత్రకి చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.కెరీర్ పరంగా గుడ్ ఫేజ్, బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. నాకిది గుడ్ ఫేజ్‌గా భావిస్తున్నా’ అని తెలిపింది.
ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి ‘సూర్యవంశీ’లో నటిస్తుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. గతంలో అక్షయ్ కుమార్ నటించిన ‘మోహ్రా’ చిత్రంలోని ‘టిప్ టిప్ బర్సా పాని’ అనే పాపులర్ సాంగ్‌ని ఈ చిత్రం కోసం రీమిక్స్ చేయబోతున్నారు. రోహిత్ శెట్టి ఇప్పటికే ఈ పాట రైట్స్‌ని దక్కించుకున్నారట. అక్కీ, క్యాట్లపై ఈ పాటని వచ్చే వారం హైదరాబాద్‌లోని రామోజీఫిల్మ్ సిటీలో జరగబోయే షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. పాత పాటకి ఏమాత్రం తీసిపోని విధంగా తాజా సాంగ్‌ని చిత్రీకరించడానికి దర్శకుడు రోహిత్ శెట్టి భారీగా ప్లాన్ చేస్తున్నారట.
‘అవెంజర్స్’ స్టార్ జెరెమీ రెన్నర్‌తో…
‘హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇంగ్లీష్ స్క్రిప్ట్స్ అంటే
చాలా ఇష్టం’ అని అంటున్నారు కత్రినా కైఫ్. ఇటీవల ‘భారత్’తో మంచి విజయాన్ని అందుకున్న కత్రినా బాలీవుడ్‌తోపాటు గతంలో తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో ‘మల్లీశ్వరి’, ‘అల్లరి పిడుగు’ చిత్రాల్లో నటించిన విషయం విదితమే. ప్రస్తుతం హిందీలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కత్రినా త్వరలో ఓ ఇంగ్లీష్ ప్రాజెక్ట్‌లో మెరవనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇటీవల కత్రినా ఫాక్స్ స్టూడియో ఫిల్మ్ మేకర్స్‌తో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి కథా చర్చలు జరిగినట్టు, ‘అవెంజర్స్’ స్టార్ జెరెమీ రెన్నర్‌తో కలిసి నటించబోతున్నట్టు వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.దీని గురించి కత్రినా చెబుతూ… ‘ఇటీవల ఓ స్క్రిప్ట్ విన్నాను. ఇది విన్న తర్వాత హాలీవుడ్ చిత్రంలో నటించాలనిపించింది. అంత బాగా ఆ స్క్రిప్ట్ నచ్చింది’ అని తెలిపారు.