కవిత్వం మనిషి భావోద్వేగాల్నీ వ్యక్తీకరించే గొప్ప కళ అని, అది ఒక జాతి జీవధార అని ప్రముఖకవి, ‘సరస్వతీ సమ్మాన్’ పురస్కార గ్రహీత కె శివారెడ్డి అన్నారు. కవి, విమర్శకుడు దర్భశయనం శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో రూపొందిన “కవిత్వం 2018‘’ సంకలనాన్ని16.6.2019 ఆదివారం నారాయణగూడ తాజ్ మహల్ హోటల్ లో ఆయన ఆవిష్కరించారు.
2018 వ సంవత్సరంలో వివిధ పత్రికల్లో అచ్చయిన కొన్ని వందల కవితల్ని పరిశీలించిన దర్భశయనం వాటిలో తనకు ఉత్తమంగా అనిపించిన అరవై కవితల్తో ఈ సంకలనాన్ని రూపొందించారని కె. శివారెడ్డి అన్నారు. ఇది బృహత్తరమైన పని అంటూ,ఈ సంపాదక కర్తవ్యాన్ని దర్భశయనం ఇష్టంగా గత 15 యేళ్లుగా చేస్తున్నారని చెప్పారు. ఎన్నో శతాబ్దాల క్రితం ఆరంభమైన కవిత్వం మానవ జాతి మనగలిగినంత కాలం వుంటుందని శివారెడ్డి అంటూ, కవిత్వానికి కాలం చెల్లిందని ఎవరూ ఆనలేరన్నారు. మిగతా భారతీయ భాషల్తో పోలిస్తే తెలుగు కవిత్వం ఎంతో ముందంజలో వుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా సంపాదకుడు దర్భశయనం మాట్లాడుతూ…
వస్తుపరంగా తెలుగు కవిత్వం అధ్భుతంగా వుందని, అభివ్యక్తి విషయంలో కవులు ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టాలని అన్నారు. సీనియర్ కవుల కవితలతో పాటు, కొత్త కవుల కవితలు కొన్ని ఈ సంకలనంలో చేర్చినట్లు ఆయన చెప్పారు. దాదాపు అయిదు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న కవులు వరవరరావు, శివారెడ్డి లాంటి కవుల స్ఫూర్తితో కొత్త కవులు ఉత్తేజం పొందుతున్నారని,ఇదొక సుగుణమని దర్భశయనం అన్నారు. ఇలాంటి సంకలనాల వల్ల, తెలుగుకవిత్వపు వివిధ పోకడలు, రీతులు రికార్డు అవుతాయని ఆయన
అభిప్రాయపడ్డారు. సాహిత్యకారులు వారాల ఆనంద్, యాకూబ్, రమణ జీవి, శిఖామణి, ప్రసాదమూర్తి, ఆశారాజు, రాము, రహమతుల్లా, దేశరాజు, విన్నకోట రవిశంకర్,ఆకాశవాణి రాంబాబు తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
“కవిత్వం 2018 ‘’ లో 60 మండి కవుల ఎంపిక చేసిన కవితలున్నాయి.30 ఏళ్లుగా కవిత్వం రాస్తూ తనదయిన ఒక ముద్రను రూపొందించుకున్న దర్భశయనం గత పదిహేనేళ్లుగా ఉత్తమ కవితల్ని సంపాదకుడిగా ఎంపిక చేసి సంకలనాల్ని వెలువరిస్తుండడం పట్ల ఆయన నిబద్దతను కవి వారాల ఆనంద్, యాకూబ్ తదితరులు అభినందించారు. కవిత్వం పట్ల ఇష్టం ఉన్నకవిగా ఆయన కృషిని పాల్గొన్న కవులు సాహితీకారులూ దర్భాశయనం కృషిని కొనియాడారు.