యూత్ పేరుతో ముద్దులూ, బూతులూ…. ‘హిప్పీ’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 1.5/5

వి క్రియేషన్స్‌ బ్యానర్ పై టి.ఎన్‌.కృష్ణ దర్శకత్వంలో కలైపులి ఎస్‌. థాను ఈ చిత్రం నిర్మించారు.

కధలోకి వెళ్తే… ‘హిప్పీ’ దేవదాస్‌(కార్తికేయ) ఓ కిక్‌ బాక్సర్‌. తనకి స్నేహ(జెజ్‌బా సింగ్‌) లవ్‌ ప్రపోజ్‌ చేస్తుంది. తనతో దేవా డేటింగ్‌ చేస్తుంటాడు. ఓసారి స్నేహతో కలిసి గోవాకు వెళుతున్న సమయంలో ఆముక్త మాల్యద(దిగంగన సూర్యవంశీ)ని చూసి ఇష్టపడతాడు. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన దేవా, స్నేహతో తాను లవ్‌లో లేడని తెలుసుకుంటాడు. ఆముక్తకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ముందు ఫ్రెండ్‌ లవర్‌ను తన లవర్‌గా ఆముక్త ఒప్పుకోదు. చివరకు స్నేహయే వారిద్దరినీ ఒకటి చేస్తుంది. అక్కడ నుండి ఆముక్త, దేవ ప్రేమ ప్రయాణం స్టార్ట్‌ చేస్తారు. క్రమంగా ఆముక్త కండీషన్స్‌ను హిప్పీ తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకుంటాడు. విషయం పసిగట్టిన ఆముక్త అతనితో ‘లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌’ను స్టార్ట్‌ చేస్తుంది. ఓ సందర్భంలో ఇద్దరూ మనస్పర్ధలతో విడిపోతారు. ఆ సమయంలో ఆముక్త కార్తికేయ బాస్‌ (జె.డి.చక్రవర్తి)ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటుంది. హిప్పీ కూడా మరో అమ్మాయి(శ్రద్ధాదాస్‌)ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. హిప్పీ లవర్‌ ఆముక్తను పెళ్లి చేసుకుంటున్న అతని బాస్‌ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవని తెలుసుకోవడానికి ఓ కండీషన్‌ పెడతాడు. ఇంతకు హిప్పీ, ఆముక్త కి పెట్టే కండీషన్‌ ఏంటి? ఆ కండీషన్‌ వల్ల ఇద్దరూ కలుసుకున్నారా? మళ్లీ విడిపోయారా? అనే సంగతిని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే….

విశ్లేషిస్తే… తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త తరహా చిత్రమైతే కాదు. ఎప్పటి నుండో చూస్తున్న రొటీన్ లవ్‌ఫార్ములానే. అయితే నేటి ట్రెండ్‌కు తగినట్లు … నేటి యూత్‌కు తగ్గట్లు అంటే కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలు, ఘాటు లిప్‌లాక్‌లు.. ఎరోటిక్‌ పదాలను ఈ సినిమాలో చొప్పించారు.దర్శకుడు టి.ఎన్‌.కృష్ణ విషయానికి వస్తే.. ఇందులో యూత్‌కు తగ్గ కాన్సెప్ట్‌తో లవర్స్‌ మధ్య వచ్చే గొడవలు, వారు కలిసిపోవడం అనే పాయింట్‌ను రొమాంటిక్‌ యాంగిల్‌లో చూపించాడు.
 
‘ఆర్‌ఎక్స్‌ 100’లో హీరోగా కార్తికేయ యూత్‌కి నచ్చాడు. కనుక అతనితో చేసే సినిమాలో యువతకు నచ్చే అంశాలని పెట్టేస్తే సక్సెసయి పోతుంది’… అనే ఆలోచనలోంచి పుట్టిన సినిమానే హిప్పీ. బేసిగ్గా ఇందులో ఒక కథంటూ లేదు. కేవలం ఆడాళ్లు, మగాళ్లు బూతు సంభాషణలు చేసుకోవడం, మసాలా సరిపోనపుడు ఒక లిప్‌ లాక్‌ పడేయడం… ఇంకా అవసరం అనుకున్నపుడు కార్తికేయతో చొక్కా విప్పించడం…అవసరం లేకుండా పచ్చిగా మాట్లాడేస్తుంటారు. కారణం లేకుండా ముద్దులు, సందర్భం లేకుండా వయాగ్రా వంటి  ప్రస్తావనలతో యువతను ఆకట్టుకోవడానికి విఫలయత్నం చేసారు. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలోనూ లిమిట్స్‌ క్రాస్‌ చేసారు.స్లో నేరేషన్‌ తో కథనం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది
 
నటీనటులు… ‘ఆర్‌.ఎక్స్‌ 100’లో లవ్‌ ఫెయిల్యూర్‌గా కనపడి ఆకట్టుకున్న కార్తికేయ ఈ చిత్రంలో ప్లేబోయ్‌, లవర్‌బోయ్‌ క్యారెక్టర్‌లో చేసాడు. ‘అమ్మాయిని మనం ప్రేమిస్తే అది స్వర్గం.. అదే అమ్మాయి మనల్ని ప్రేమిస్తే అది నరకం’ అనే జాన్‌ మిల్టన్‌ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు తెరకెక్కించిన సినిమా. పాత్ర పరిధి మేర బాగానే నటించాడు. ముఖ్యంగా బాక్సింగ్ సీన్ లో, ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ తో గొడవ పడే సీన్ లో, ఆ తరువాత ఇద్దరూ ఒకటయ్యే సీన్ లో కార్తికేయ బాగా చేసాడు. ఇక తొలి సినిమానే అయినా హీరోయిన్ గా నటించిన దిగంగన సూర్యవంశి బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. జెజ్‌బా సింగ్‌ పాత్ర చాలా పరిమితం. సినిమాలో మరో కీలకమైన పాత్ర జె.డి.చక్రవర్తి. ‘నేను పెళ్లి చేసుకునే మెటీరియల్‌ కాదు’ అంటూ హీరో ప్రేమకు సలహాలు ఇస్తాడు. చివరకు క్లైమాక్స్‌లో పెళ్లి చేసుకుంటాడు. ఈ పాత్రను జె.డి.చక్రవర్తి ఎందుకు చేశాడో ఆయనే క్లారిటీ ఇవ్వాలి. జెడి చక్రవర్తి చేసేంత ప్రత్యేకత, ప్రాధాన్యత వున్న పాత్ర ఖచ్చితంగా కాదు. జెడి చక్రవర్తితో రామ్‌గోపాల్‌వర్మ ఫిలాసఫీలు మాట్లాడించారు. వెన్నెల కిషోర్‌ అంతసేపు కనిపించినా నవ్వించలేకపోయాడు. బ్రహ్మాజీ పాత్ర కూడా ఏదోకామెడీ పండించే ప్రయత్నం చేసింది. శ్రద్దాదాస్‌ పాత్ర జస్ట్‌ ఓకే.
 
సాంకేతిక వర్గం… నివాస్‌ కె.ప్రసన్న అందించిన సంగీతంలో ఓ విచారకరమైన సాంగ్‌ ట్యూన్‌ బావుంది. సాహిత్యం లేకుండా కొన్ని బాణీలు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చినపుడు బాగున్నాయనిపించాయి. మిగిలిన పాటలు… బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ బాగులేదు. ఈ సినిమా కంటూ ఆకర్షణ ఏదయినా వుంటే.. అది ఛాయాగ్రహణం ఒక్కటే. ఆర్‌.డి.రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ బావుంది.గోవాలో వచ్చే దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. ప్రవీణ్ కె ఎల్ ఎడిటింగ్ ఓకే. నిర్మాత కలైపులి ఎస్ థాను పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి -రాజేష్