‘ప్రముఖ గొప్ప నటులు మెరిల్ స్ట్రీప్ నుంచి సైఫ్ అలీ ఖాన్ వరకు ఎంతో మంది నటీనటులు సినిమాలు చేస్తూనే టెలివిజన్స్ చేశారు. నేను చేస్తే తప్పేంటి?’ అని ప్రశ్నిస్తోంది కరీనా కపూర్. తైమూర్ అలీఖాన్‌కి జన్మనిచ్చిన తర్వాత గతేడాది ‘వీరె ది వెడ్డింగ్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన కరీనా చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె రెండు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా బుల్లితెర ప్రేక్షకుల్ని ఫిదా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘డాన్స్ ఇండియా డాన్స్’ రియాలిటీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
సినిమాల్లో నుంచి టీవీ రంగంలోకి ఎందుకు వెళ్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ…”ప్రపంచంలోనే గొప్ప నటులు మెరిల్ స్ట్రీప్ నుంచి సైఫ్ అలీ ఖాన్, షెఫాలి షా నుంచి బెనెడిక్ట్ వరకు ఇలా ఎంతో మంది టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అంత గొప్ప నటులు చేసినప్పుడు నేను చేయడం పెద్ద ఇబ్బంది కాదు. కుటుంబ ప్రేక్షకులకు రీచ్ అవ్వడానికి టీవీ బెస్ట్ ఆప్షన్. ఇండియాలోనే మొదటిసారి ఈ రియాలిటీ షోలో స్టేజ్‌ని 360 డిగ్రీస్‌లో నిర్మించారు. ఇదొక కొత్త ఎక్స్‌పీరియెన్స్’ అని తెలిపింది.
ఈ షో కిగానూ ఆమె కేవలం రెండు వారాలు మాత్రమే టైమ్ కేటాయించిందట. తైమూర్‌ని చూసుకోవడం కోసం అలా చేశానని కరీనా చెప్పింది. ప్రస్తుతం ఆమె అక్షయ్ కుమార్‌తో కలిసి ‘గుడ్‌న్యూస్’లో నటిస్తుంది. రాజ్ మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ, దిల్జిత్ దోసాంజే ఇతర నటులు. దీంతోపాటు ‘అంగ్రేజీ మీడియం’ అనే మరో సినిమా కూడా చేస్తోంది.
వాటి కోసం మరింత కష్టపడతా
కరీనా కపూర్ ప్రేక్షకుల్ని అలరిస్తుందంటే కారణం… ఆమె ఎంచుకునే పాత్రలే. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ పాత్రల్లోనే కాదు.. సామాజిక అంశాల నేపథ్యంలో సాగే చిత్రాల్లోనూ ఆమె తనేంటో నిరూపించుకుంది. ‘ఉడ్తా పంజాబ్’, ‘కీ అండ్ క’, ‘వీరె ది వెడ్డింగ్’ చిత్రాల్లో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది కరీనా. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘గుడ్ న్యూస్’, ‘అంగ్రేజీ మీడియం’ కూడా సామాజిక నేపథ్యంతో సాగే చిత్రాలే. ఈ తరహా చిత్రాల కోసం తను మరింత కష్టపడతానంటోంది కరీనా. ‘‘సామాజిక నేపథ్య చిత్రాలు, మనసుని కదిలించే కథాంశాలు ఉన్న చిత్రాల్లో నటించేటప్పుడు మరింత ఏకాగ్రతతో పనిచేస్తాను. అలాంటి చిత్రాల్లో చిన్న పాత్రైనా సరే కష్టపడతాను. బలమైన కథ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్న రోజులవి. ‘గుడ్ న్యూస్’ బాగా వచ్చింది. అక్షయ్‌కుమార్ ఈ చిత్రానికి మరింత బలం’’అంది కరీనా.