సినీవినోదం రేటింగ్ : 1.5/5
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ రాఘవ దర్శకత్వం లో ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు
కధలోకి వెళ్తే… నందగోపాల కృష్ణ అలియాస్ ఎన్.జి.కె(సూర్య) ఊర్లో సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు(ఉమా పద్మనాభన్ నిరల్‌గల్ రవి), భార్య గీతాకుమారి(కుమారి) సపోర్ట్‌గా ఉంటారు. మంచి చేసే ఎన్.జి.కె అంటే నచ్చని వాళ్లు అతనిపై, అతని మనుషులపై దాడి చేస్తారు. దాంతో సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే(ఇళవరసు) దగ్గరకు వెళితే, తన పార్టీలో జాయిన్ అయితేనే సహాయం చేస్తానని అంటాడు. విధిలేక గోపాల్ ఎమ్మెల్యే దగ్గర చేరుతాడు. ఎమ్మెల్యే గోపాల్‌ను మానసికంగా బాధపెడుతుంటాడు. దాంతో రాజకీయాల్లోకి తాను రావాలనుకుని గోపాల్ ఎమ్మెల్యే చెప్పిన పనులన్నీ చేస్తుంటాడు. ఎన్.జి.కె గురించి తెలుసుకున్న పార్టీ అధిష్టానం పి.ఆర్ వనిత(రకుల్ ప్రీత్ సింగ్) ఎన్.జి.కెని ఓ సహాయం అడుగుతుంది. ఆమె కోరే సహాయం ఏంటి? దాని వల్ల ఎన్.జి.కె ఎదుర్కొన్న సమస్యలేంటి? చివరకు నందగోపాల కృష్ణ అనుకున్నది సాధించాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషిస్తే… సూర్య ఇంతవరకూ టచ్ చేయని పొలిటికల్ జోనర్లో శ్రీరాఘవ దర్శకత్వంలో నటించిన చిత్రమిది. దర్శకుడు శ్రీరాఘవ చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా. పొలిటిక్ బ్యాక్‌డ్రాప్ కావడంతో ఆసక్తికరమైన అంశాలు ఇందులో ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు.అయితే, దర్శకుడు సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడనేది క్లారిటీ లేదు. పాత్రలు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. సన్నివేశాలకు లింకులుండవు. సూర్య డైరెక్టర్, స్క్రిప్ట్‌కు లోబడి నటించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడా హీరోయిజం ఎలివేషన్లేకుండా సినిమాను, కథ ప్రకారం పాత్రను డిజైన్ చేశారు. ఇక సూర్య భార్యగా నటించిన సాయిపల్లవి మొగుడితో పెర్ఫ్యూమ్ గురించి గొడవపడుతూ ఉంటుంది. ఆ విషయంలో అంతగా గొడవ పడాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. అనుమానంతో గొడవ పడినా కూడా.. సూర్య కోపంగా మాట్లాడినప్పుడు… ఆమె ‘తన భర్త మంచివాడు’ అంటూ కితాబిచ్చేస్తుంది.ఇక రకుల్ పాత్రకు ఇంట్రడక్షన్లో ఇచ్చిన బిల్డప్‌కు, ఆమె పాత్ర సాగే తీరుకు సంబంధమే ఉండదు.సాధారణ కార్య కర్త సీఎం గా ఎదిగినట్లు ప్రేక్షకుడిని నమ్మించాలంటే చాలా బలమైన సన్నివేశాలు ఉండాలి. అలాంటి ఒక్క సన్నివేశం కూడా మనకు కనిపించదు. నందగోపాల్ ఒక్క స్పీచ్ తో కార్యకర్తలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడ్ని సజీవదహనం చేయడం, నందగోపాల్ సీఎం ఐపోవడం వంటి సన్నివేశాలు వేగంగా నడిపించి… శుభం కార్డు వేసేశారు. దిశ, గమ్యం లేని కథనం,అర్థం కాని పాటలు,సంగీతం, నేపథ్య సంగీతం,పాత్రల చిత్రీకరణ ఈ చిత్రంలో మైనస్. ఫోటోగ్రఫీ,ఎడిటింగ్ బాగున్నాయి.
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవలసిన విషయాలలో సూర్య నటన ఒకటి. ఎమ్మెల్యే కి దగ్గరవడానికి నందగోపాల్ నటించే తీరు, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలలో సూర్య నటన ఆకట్టుకుంటుంది. ప్రతిపక్ష పార్టీ కి పొలిటికల్ సలహాదారుగా రకుల్ చాలా ట్రెండీగా, గ్లామరస్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో సిద్ శ్రీరామ్ పాడిన రకుల్ సూర్యాల మధ్య వచ్చే యువన్ శంకర్ రాజా మెలోడీ సాంగ్ బాగుంది.ఇక సాయి పల్లవి సూర్య భార్యగా గీత పాత్రలో మెప్పించింది -రాజేష్