‘యంగ్ రెబెల్‌స్టార్’ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారు సోమవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘సాహో’ చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతున్న నేపథ్యంలో సంగీత దర్శకులు సినిమా నుంచి తప్పుకోవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే సినిమా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? అన్న విషయంపై శంకర్ మీడియా ద్వారా వెల్లడించారు…
‘సాహో’లో బయటి కంపోజర్ల నుంచి మరిన్ని పాటలు యాడ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ విషయం మాకు కాస్త అసౌకర్యాన్ని కలిగించింది. సినిమాకు మేమే సంగీత దర్శకులుగా ఉండాలని అనుకున్నాం. అందుకే సినిమా నుంచి తప్పుకొన్నాం. సినిమాకు మేమింకా పాటలు కంపోజ్ చేసే పనిలోనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక సినిమాకు ఎందరో సంగీత దర్శకులు కలిసి పనిచేయడం చూస్తూనే ఉన్నాం. ఇదే విషయం గురించి నిర్మాణ సంస్థ మాతో చర్చించింది. అయితే మాకు ఇష్టంలేదని చెప్పేశాం. ఎందుకంటే ఒక సినిమాకు ఒక సంగీత దర్శకుడే సంగీతం అందిస్తారు. ‘ఫలానా సినిమాకు సంగీతం అందించింది ఆయనే’ అని చెప్పడంలోనే మనకు గౌరవం దక్కుతుంది. ఈ సినిమాకు సంగీతంతో పాటు నేపథ్య సంగీతం కూడా మేమే అందించాలనుకున్నాం. కానీ నిర్మాణ సంస్థ అందుకు వేరొకరిని నియమించుకుంది. కనీసం పాటల వరకైనా మమ్మల్ని మాత్రమే తీసుకోవచ్చు కదా? నేను, ఎహసాన్, లాయ్ కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించాం. మేం ‘మల్టిపుల్ కంపోజర్స్’ అనే ఐడియాను వ్యతిరేకించడంలేదు. కానీ అంతమందితో కలిసి పనిచేయాలంటే మాకు సౌకర్యంగా ఉండదు.అందుకే సినిమా నుంచి తప్పుకొన్నాం… అని వెల్లడించారు శంకర్.