“సినిమా ఆర్టిస్ట్ జాబ్ చాలా టఫ్. మన భుజం మీద చాలా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఒక్క సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఆ వేగాన్ని అందుకోవాలంటే చాలా కష్టపడాలి. ఎండ, వాన, చలి.. ఇలా సీజన్స్‌ని పట్టించుకోకూడదు. మాకున్నదల్లా సినిమా సీజన్ ఒక్కటే. ఆల్ టైమ్ సీజన్ అన్నమాట. దానికోసం ఎంతైనా కష్టపడాలి. మరి పేరు, డబ్బూ ఊరికే రావు కదా.హీరోయిన్ కావాలని కలలు కన్నాను. ఆ కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. నిజమైంది. కెరీర్ ఫుల్ స్పీడ్. దాన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఇంకా కష్టపడుతున్నాను”… అని చెప్పింది ‘ఆర్‌డిఎక్స్’ నాయిక పాయల్ రాజ్‌పుత్.
‘వెంకీ మామ, మన్మధుడు 2,డిస్కో రాజా, ఆర్‌డిఎక్స్ లవ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా’ సినిమాలు చేస్తున్నాను. తమిళంలో ‘ఏంజెల్’ అనే సినిమాలో నటిస్తున్నాను. తేజగారి ‘సీత’లో స్పెషల్ సాంగ్ చేశాను. చూసే ఉంటారు. లైఫ్ చాలా బిజీ బిజీగా ఉంది. అయినా తప్పక బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.నెల రోజులుగా పాపికొండల్లో ‘ఆర్‌డిఎక్స్ లవ్’ సినిమా కోసం ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. అంతా సాఫీగా జరిగితే బ్రేక్ వచ్చేది కాదు. ఒక పాటకు డ్యాన్స్ చేస్తూ గాయపడ్డాను. ఆ పాట తీసే ముందు నాలుగు రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. అప్పుడు మోకాలి ఎముక డిస్‌లొకేట్ అయింది. దాంతో పది రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్‌లో ఉండాల్సి వచ్చింది.
రెండు చాలెంజింగ్ రోల్స్
రవితేజతో చేస్తున్న ‘డిస్కో రాజా’లో డెఫ్ అండ్ డమ్ (మూగ, చెవిటి అమ్మాయి) పాత్రలో కనిపిస్తాను. నటిగా నన్ను సవాల్ చేసే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. దానికోసం ఎంతైనా కష్టపడతాను.
అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాను. అందులో వేశ్య పాత్రలో కనిపిస్తాను. అది బయోపిక్. నిజంగా చాలెంజింగ్ రోలే. సవాళ్లు నాకిష్టం .ఈ సినిమా ఒప్పుకున్నాక వేశ్యల లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. వారి జీవితం అంత ఈజీగా సాగదు. ఒకవేళ వాళ్లు బతకడం కోసమే ఆ పని చేస్తున్నారంటే… దాన్ని ఆపేయమని చెప్పలేం. కేవలం డబ్బు కోసం, లగ్జరీల కోసం అలాంటి పనులు చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఎవరి జీవితం..వారిష్టం! కాబట్టి ‘నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు’ అని కామెంట్ చేయలేం.