సినీవినోదం రేటింగ్ : 2/5
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ తేజ దర్శకత్వంలో అనిల్ సుంకర, సుంకర రామ బ్రహ్మం ఈ చిత్రం నిర్మించారు
కధలోకి వెళ్తే… ఆనంద్ మోహన్ రంగ(భాగ్యరాజ్) తన మేనల్లుడు రఘురామ్(బెల్లంకొండ సాయిశ్రీనివాస్)ని తన భార్య పెట్టే బాధలు చూడలేక .. మేనల్లుడ్ని భూటాన్‌లోని బౌద్ధుల దగ్గర చేరుస్తాడు. వారి పాలనలో పెరిగిన రఘరామ్ ఈ లోకంలో కుళ్లు కుతంత్రాలకు దూరంగా పెరుగుతాడు. ఆనంద్ మోహన్ రంగ కుమార్తె సీత(కాజల్ అగర్వాల్) మాత్రం రఘురామ్‌కి భిన్నంగా పెరుగుతుంది. డబ్బే ప్రధానంగా పెరుగుతుంది. పెద్ద హోటల్ కట్టాలనే ఉద్దేశంతో ఓ స్థలాన్ని డబ్బులకు కొంటుంది. అక్కడుండే జనాలను తరిమేయడానికి ఎమ్మెల్యే బసవరాజ్ గౌడ్(సోనూసూద్) సహాయం కోరుతుంది. సోనూసూద్ సీతపై కామంతో ఒక నెలరోజుల పాటు తనతో గడిపితే తాను సహాయం చేస్తానంటాడు. అలాగే సహజీవనం చేస్తానని అగ్రిమెంట్‌పై సీత సంతకం పెడుతుంది సీత. బసవరాజు అక్కడి జనాల్ని తరిమేసిన తర్వాత అగ్రిమెంట్ గురించి పట్టించుకోదు. దాంతో బసవరాజు తన పొలిటికల్ పవర్‌ను ఉపయోగించి సీత బ్యాంకు అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్ అన్నింటినీ సీజ్ చేస్తాడు. సీతపై చెక్ బౌన్స్ కేసు కూడా పెట్టిస్తాడు. ఇక చేసేదేం లేక సీత తండ్రిని డబ్బులు అడగాలని అనుకుంటుంది. కానీ తండ్రి గుండెపోటుతో చనిపోతాడు. ఆ సమయంలో సీతకొక నిజం తెలుస్తుంది. తండ్రి 5 వేల కోట్ల రూపాయల ఆస్థిని రఘురామ్‌పై రిజిష్టర్ చేయించాడని. అతన్ని పెళ్లి చేసుకుంటేనే డబ్బులు తనకు దక్కుతాయని సీత తెలుసుకుని భూటాన్‌లోని రఘురామ్‌ని కలుసుకుంటుంది. రఘురామ్‌ని మోసం చేసి పేపర్స్‌పై సంతకాలు పెట్టించుకుని వదిలించుకోవాలనుకుంటుంది. అప్పుడు పరిస్థితులు ఎలా అడ్డం తిరుగుతాయి. బసవరాజు సీతను పొందడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? సీతను రఘురామ్ ఎలా కాపాడుతాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాలి….
విశ్లేషణ… దర్శకుడు తేజ సినిమాను పూర్తిగా హీరోయిన్ యాంగిల్‌లో నడిపించాడు. కాజల్ పాత్రను బాగా ఎలివేట్ చేసిన తేజ మిగతా పాత్రలపై దృష్టి పెట్టలేదు. సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కథ అంతా చెప్పేసిన దర్శకుడు … తరువాత సినిమాని ముందుకు నడిపేందుకు చాలా కష్టపడ్డాడు.అతని గత చిత్రాల్లోని పాత్రలు, సన్నివేశాలు చాలా రిపీట్ అయినట్లు అనిపిస్తుంది. కథపరంగా పెద్దగా మలుపులు లేకపోయినా కథనంలో ట్విస్ట్‌లు పెట్టె ప్రయత్నం చేశాడు.ఎంచుకున్న కథకి ఆకట్టుకునే కథనం రాయడం లో ఫెయిల్ అయ్యాడు. కథనం ఎక్కడా ప్రేక్షకుడిని త్రిల్ చెయ్యదు. ప్రేక్షకుడికి తరువాత రాబోతున్న సీన్ అర్దమైపోతుంటే సినిమాపై ఆసక్తి ఏం ఉంటుంది ? చాలా స్కీన్స్ లో లాజిక్ మిస్సయింది. నాలుగు బుల్లెట్లు దిగి పల్స్ రేట్ 24 కి పడిపోయిన హీరో లేచి ఫైట్ చేయడం నమ్మబుద్ది కాదు.పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ మాస్ ఆడియెన్స్ కోసమే..యాక్షన్ మూవీస్ హీరో శ్రీనివాస్ ని అమాయకపు పాత్రలో ఊహించుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సినిమాకి మ్యూజిక్ మరో మైనస్, ఒక్కపాట కూడా మనసుకు హత్తుకునేలా లేదు. ఫస్ట్ హాఫ్ ‘ఏదో నడిచిందిలే’ అని అనుకుంటే… సెకండ్ హాఫ్ ‘బాబోయ్అంటూ’ భయపడే వరకు సాగదీసాడు. సెకండాఫ్ విషయంలో తేజ కేర్ తీసుకుని ఉండాల్సింది.