రిజ్వాన్ కల్ షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం `ఓమనిషి నీవెవరు`. గాడ్ మినీస్ర్టీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ మూర్తి రాజ్ కుమార్ నాయుడు దర్శకత్వంలో స్వర్ణ కుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సూపర్ స్టార్ కృష్ణ స్వగృహంలో ఆయన చేతుల మీదుగా జరిగింది. అనంతరం ప్రసాద్ ల్యాబ్ లో మొదటీ వీడియో సాంగ్ ను తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ విడుదల చేసారు.
అనంతరం తనికెళ్ల భరణి మాట్లాడుతూ, ` జీసస్ అంటే ప్రేమ, శాంతి. ఇలాంటి సినిమా వేడుకల్లో పాల్గొనడం అంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా డీవోపి నాకు బంధువు. ఆ కారణంగానే వేడుకకు తప్పక హాజరు కావాల్సి వచ్చింది. సినిమా అందరికీ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, ` ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. చక్కని సందేశాత్మక చిత్రమిది. పాటలు బాగున్నాయి` అని అన్నారు.
సుమన్ మాట్లాడుతూ, ` నాకు కులం, మతం, ప్రాంతం లాంటి బేధాలు లేవు. నా దృష్టిలో అంతా ఒక్కటే. చెన్నైలో క్రిస్టిన్స్ స్కూల్ లోనే చదువుకున్నా. నా తల్లిదండ్రుపై క్రిస్టియన్స్ ప్రభావం ఉంది. అలా నేను కూడా జీసస్ ఆకర్షితుడినే. ఈ సినిమాలో పాత్ర చెప్పగానే ఆలోచించకుండా చేస్తానని చెప్పాను. చాలా వైవిథ్యంగా, కష్టంగా ఉండే పాత్ర కూడా. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. నటులందరికీ ఎంతో కమిట్ మెంట్ ఉండాలి. అది ఈ సినిమా యూనిట్ లో చూసాను. ఇలాంటి సినిమాలు చేయాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఏసు పాత్రకు రిజ్వాన్ బాగా సూటయ్యాడు. అన్ని పాటల్లో ఫీల్ ఉంది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు.
సీనియర్ నటి కవిత మాట్లాడుతూ, ` అప్పట్లో తెరకెక్కిన కరుణామయుడు 16 భాషల్లో విడుదలై మంచి విజయం సాధించింది. అలాంటి నేపథ్యాన్ని తీసుకుని వేణు గోపాల్ గారు సినిమా చేయడం హర్షించదగ్గ విషయం. అన్నీ పాటలు బాగున్నాయి. సాహిత్యం చాలా బాగుంది` అని అన్నారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. చక్కని సందేశాత్మక చిత్రమిదని సీనియర్ దర్శకులు సాగర్ అన్నారు.
చిత్ర దర్శకుడు కృష్ణ మూర్తి రాజ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ, ` గోపాలకృష్ణ గారికి నేను వేరే కథ చెప్పాను. కానీ ఆయన ఈ కథ చెప్పి సినిమా తీయించారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాతో చాలా మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిచయం అవుతున్నారు. ఇదంతా జీసస్ బ్లస్సింగ్ వల్లే జరిగింది. శివ ప్రసాద్ గారి సహకారం మరువలేనిది. ఆయన లేకపోతే ఈ సినిమా పూర్తచేసేవాడిని కాదు. సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
రిజ్వాన్ కులషాన్ మాట్లాడుతూ, ` నటుడిగా తొలి చిత్రమిది. ఏసు గొప్పతనాన్ని చెప్పే సినిమాలో నటించడం చాలా సంతోషాన్నిచ్చింది` అన్నారు.
రచయిత గోపాలకృష్ణ దొండపాటి మాట్లాడుతూ, ` చచ్చి బ్రతికినవాడిని. ఓసారి నాకు యాక్సిడెంట్ జరిగింది. చనిపోయిన వాడినే ఏసు వల్ల పునర్జీని అయ్యాను. ఏసు ఎప్పుడు పుట్టాడు..ఎప్పుడు స్వర్గస్తులయ్యారన్న విషయాలు ఇందులో చెప్పలేదు. కేవలం ఆయన గొప్పతనాన్ని మాత్రమే చెబుతున్నాం` అని అన్నారు.
కెమెరా మెన్ సూర్యభగవాన్ మోటూరి మాట్లాడుతూ, ` తనికెళ్ల రాజేందర్ వద్ద 15 ఏళ్లు అసిస్టెంట్ కెమెరా మెన్ గా పనిచేసాను. డీవోపీగా తొలి చిత్రమిది. దర్శక, నిర్మాతలు నామీద పెట్టిన నమ్మకాన్ని నిజం చేసాను అనుకుంటున్నా` అని అన్నారు.
ఈ సమావేశంలో ప్రమోద్, రాథా మాత్యూస్, శంకర్ లోక్, ఉషాకిరణ్, విల్సన్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, అమోల్ , చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
పల్లె విష్ణు వర్దన్ రెడ్డి, డింపు ఫణికుమార్, జెన్ని, జూనియర్ రేలంగి, బి.హెచ్.ఇ. యల్ ప్రసాద్, ఆకెళ్ల, సంగీత్ ఆనంద్, మునీశ్వరరావు, జాను, అరుణ తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే: గోపాలకృష్ణ దొండపాటి, మాటలు: జి. విజయ, పాటలు: వినయ్ కుమార్, కొరియోగ్రపీ: వేణు మాస్టర్, కళ: సుభాష్, ఎడిటింగ్: వి. నాగిరెడ్డి, ఛాయాగ్రహణం: సూర్య భగవాన్ మోటూరి, చీఫ్- కోడైరెక్టర్: జి. శివ ప్రసాద్ రెడ్డి, సహ నిర్మాత: జంపన దుర్గా భవానీ.