“నేనూ ప్రేమలో పడ్డా”నంటోంది నటి కాజల్‌అగర్వాల్. హీరోయిన్లు లవ్‌లో పడడం సహజమే. అదీ కాజల్‌అగర్వాల్ లాంటి అంద గత్తె ప్రేమలో పడడంలో ఆశ్చర్యమేముంటుంది. అయితే అలాంటి సంఘటన కాజల్ విషయం లోనూ జరిగింది. ప్రస్తుతం అగ్ర కథానాయకిగా రాణిస్తూ కోలీవుడ్, టాలీవుడ్ చుట్టేస్తున్న కాజల్ అగర్వాల్ గురించి వదంతులు చాలానే ప్రచారంలో ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే… ఈమె చెల్లెలు నిషా అగర్వాల్ ఇప్పటికే పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. కాజల్‌కు మాత్రం ఇంకా ఆ గడియలు రాలేదు. కాగా ఇటీవల శ్రియ లాంటి సహ నటీమణులు ప్రేమపెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరి మీ పెళ్లి ఎప్పుడు? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్‌అగర్వాల్‌ను ప్రశ్నిస్తే…
“నిజం చెప్పాలంటే నేనెప్పుడో ప్రేమలో పడ్డాను” అని షాక్ ఇచ్చింది.నేను ప్రేమలో పడ్డాను కానీ, అది ఒన్‌సైడ్ లవ్‌గానే ముగిసిపోయింది. అలా నేను విపరీతంగా ప్రేమించింది ఎవరినో కాదు. క్రికెట్ క్రీడాకారుడు రోహిత్‌శర్మని. నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఇక రోహిత్‌శర్మ క్రికెట్ ఆడే తీరు ఇంకా ఇష్టం. ఆయన బ్యాటింగ్ స్టైల్, ఫీల్డింగ్ ఎనర్జీ నచ్చుతాయి. అందుకే రోహిత్‌శర్మను ఏకపక్షంగా ప్రేమించేశాను అని చెప్పింది. కాగా రోహిత్‌శర్మతో ఒన్‌సైడ్ లవ్ వర్కౌట్ కాకపోయినా, ఇప్పుడు బోత్ సైడ్ బాగానే సాగుతోందంటోంది కాజల్. అయితే ఆ లవ్ విషయం మాత్రం బయట పెట్టడంలేదు. కాజల్ అగర్వాల్ మాత్రం టైమ్ వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందనే వేదాంతాన్నే వల్లెవేస్తోంది. పంజాబ్ నేపథ్యం ఉన్న కాజల్ కుటుంబం ప్రస్తుతం ముంబైలో సెటిలైన విషయం తెలిసిందే.
ఛాలెంజింగ్ రోల్స్ కోసం…
సౌత్‌లో జెట్‌స్పీడ్‌తో కెరీర్‌లో దూసుకెళ్తోన్న కథానాయిక కాజల్ అగర్వాల్ ఆ మ్యాజిక్‌ను నార్త్‌లో చూపించలేకపోయింది. 2004లో ‘క్యాం హో గయా నా..’ అనే హిందీ సినిమాతో యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన కాజల్ ఆ తర్వాత రెండు హిందీ సినిమాలు (‘సింగమ్ (2011), స్పెషల్ 26 (2013)) చేసింది. బాలీవుడ్ సినిమాలను ఎందుకు తగ్గించారనే ప్రశ్న కాజల్ ముందు ఉంచితే…
‘‘సౌత్ ఇండియన్ ఆడియన్స్ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. సొంత మనిషిలా ఫీల్ అవుతున్నారు. నేను సౌత్ ఇండియన్‌ని కాదు. అయినా ఇక్కడ చాలా కంఫర్ట్‌గా ఉంది.అందుకే సౌత్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నాను. బాలీవుడ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలనే ఆలోచన లేకపోలేదు. కొన్ని ఆఫర్లు వచ్చాయి. కాకపోతే రొటీన్ రోల్స్ కాకుండా కాస్త విభిన్నమైన, చాలెంజింగ్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నాను. సంజయ్‌లీలా భన్సాలీ, అయాన్ ముఖర్జీ వంటి దర్శకులతో కలిసి వర్క్ చేయాలని ఉంది. పాత్రల ఎంపికలో నేను డబ్బు గురించి ఆలోచించను. కథలో నా పాత్ర నచ్చినప్పుడు నా పారితోషికాన్ని కొన్ని సందర్భాల్లో తగ్గించుకున్నాను. డబ్బు కోసం మంచి పాత్రలను వదులుకోను. పాత్రల ఎంపికకే నా ప్రాధాన్యం.. డబ్బుకి కాదు’’ అని అంది. ప్రస్తుతం కాజల్ తమిళం, తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది.