రెండు ప్రేమ జంటలు తమ ప్రేమ డేంజర్ లో పడినపుడు దానిని కాపాడుకునేందుకు ఎలా ముందుకు సాగారు అన్న కథాంశంతో ‘డేంజర్ లవ్ స్టోరి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఖయ్యూం (అలీ తమ్ముడు), మధులగ్నదాస్, గౌరవ్, అథియా జంటలుగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో లక్ష్మీకనక వర్షిణి క్రియేషన్స్ పతాకంపై అవధూత గోపాలరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని ఫిలించాంబర్లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్లో అతిథిగా పాల్గొన్న సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, భిన్నమైన టైటిల్ తో వైవిధ్యభరితమైన కథాంశంతో నేటి ప్రేక్షకులను అలరింపజేసేవిధంగా రూపొందించిన ఇలాంటి చిత్రాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మరో అతిథి సీనియర్ నటి కవిత మాట్లాడుతూ… నేటికాలంలో ప్రేమ డేంజర్లో పడటం చూస్తున్నదే. దానికి తగ్గ కథాంశాన్ని ఎంచుకుని, కరెక్ట్ టైటిల్ ను పెట్టడంలో చిత్రబృందం మొదటి విజయాన్ని సాధించిందని అన్నారు. ఇలాంటి చిన్న సినిమాలు బతికినపుడే పరిశ్రమ కళకళలాడుతుంటుంది అని అన్నారు.
చిత్ర నిర్మాత అవధూత గోపాలరావు మాట్లాడుతూ… ఆద్యంతం ఆకట్టుకునే హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. విలన్ సన్నివేశాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. గోవా, కొల్హాపూర్, నిజామాబాద్ తదితర లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ చేశాం. సుద్దాల అశోక్ తేజ, సుశీలచంద్ర సాహిత్యానికి భానుప్రకాష్ అందించిన సంగీతం వీనులవిందుగా ఉంటుందని అన్నారు. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని చెప్పారు.
చిత్ర దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ…. ఊహించని మలుపులతో ఆసక్తికర కథాంశంతో సాగే చిత్రమిదని అన్నారు. ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథలు వచ్చినప్పటికీ ఇది భిన్నంగా ఉంటుందని చెప్పారు. సస్పెన్స్, హారర్ అంశాలతో పాటు మంచి వినోదం కూడా ఇందులో ఉందన్నారు. నిర్మాత అభిరుచి వల్లే చిత్రాన్ని బాగా తీయగలిగామని అన్నారు.
హీరోలలో ఒకరైన గౌరవ్, అతనికి జంటగా నటించిన అథియా మాట్లాడుతూ, ఇది తమకు తొలి చిత్రమని, దర్శక, నిర్మాతలు అందించిన సహకారం వల్లే కొత్త అనే ఫీలింగ్ కూడా నటించగలిగామని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు డా.సకారం, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు