‘ప్రపంచం మొత్తం పురుషాధిక్యత ఉందని అనుకోవడంలో నిజం లేదు. కాలం మారుతోంది’ అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు చిత్రసీమలో కథానాయకులతో సమానంగా నాయిక పాత్రలకు విలువ ఇస్తారని, ఎలాంటి వివక్ష ఉండదని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్. ఆమె కథానాయికగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’ మే నెలలో ప్రేక్షకులముందుకురాబోతున్నది. ఈ సందర్భంగా ముంబయిలో పాత్రికేయులతో ముచ్చటించిన రకుల్‌ప్రీత్‌సింగ్ తెలుగు పరిశ్రమ గురించి తన మనోభావాల్ని పంచుకుంది.
టాలీవుడ్‌లో హీరోలకే అగ్రతాంబూలం వేస్తారనే ప్రశ్నకు స్పందిస్తూ… ‘పురుషాధిక్యం అన్ని చోట్లా లేదు. సినిమాల పరంగా తెలుగునాట హీరోలకు అధిక ప్రాధాన్యం ఇస్తారని నాకు ఎప్పుడూ అనిపించలేదు.కాల గమనంలో చాలా మార్పులొస్తున్నాయి. తెలుగులో అర్థవంతమైన సినిమాల రూపకల్పన జరుగుతున్నది. భారతీయ సినిమాలో రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ చిత్ర కథాంశం అనుష్క పాత్ర చుట్టే నడుస్తుంది. ఆమె పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. ఆమె పాత్రే సినిమా నడతను శాసిస్తుంది. కాబట్టి తెలుగులో హీరోలకే ప్రాధాన్యతనిస్తారనే వాదన సరైనది కాదు. నాయికల కోసం కూడా మంచి పాత్రల్ని సృష్టిస్తారు అని చెప్పింది.మన దగ్గర మహిళల కోసం పాత్రలు రాస్తున్నారు. అయినప్పటికీ కొంత పురుషాధిక్యత కనిపిస్తోంది. కాకపోతే గతంతో పోల్చితే ఇప్పుడది తగ్గింది’ అని తెలిపారు.
స్టార్‌డమ్ ఉన్నా హుందాగా ఉంటారు !
టాలీవుడ్ హీరోలతో తన స్నేహం గురించి చెబుతూ…..తెలుగు హీరోల్లో చాలా మంది అద్భుతమైన వ్యక్తులున్నారు. చరణ్, బన్నీ, రవితేజ ఎంతో మంచి వారు. గొప్ప డాన్సర్లు. ‘మీకు శరీరంలో ఎముకలు లేవా’ అని వారితో జోక్ చేస్తుంటాను. అంతగా తమ డాన్సులతో ఆకట్టుకుంటారు. స్టార్స్ అయినప్పటికీ వారంతా ఎంతో సింపుల్‌గా కనిపిస్తారు. స్టార్‌డమ్ ఉన్నా హుందాగా ఉంటారు.అందుకే వారికి అంతటి స్టార్‌డమ్ వచ్చిందనుకుంటా… అని పేర్కొంది. ఇక సహ కథానాయికల్లో నయనతార, త్రిష, కంగనారనౌత్, దీపికాపదుకునే, అలియాభట్ గొప్ప ప్రతిభావంతులని, భారతీయ సినిమాలో మహిళా ప్రధాన ఇతివృత్తాల ఒరవడి పెరిగిందని రకుల్‌ప్రీత్‌సింగ్ వ్యాఖ్యానించింది. దే దే ప్యార్ దే చిత్రంలో అజయ్‌దేవ్‌గణ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ 50 ఏళ్ల వ్యక్తికి ప్రేయసిగా నటించారు.రకుల్ ప్రస్తుతం ‘ఎన్జీకే’, ‘మర్జావాన్’, ‘మన్మథుడు 2’, ‘తుగ్లక్’తోపాటు శివకార్తికేయన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.