ప్రియాంక చోప్రా… గెలుపు అనేది ఏ హీరో, హీరోయిన్‌కు అయినా కిక్ ఇచ్చే విషయమే. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు ఎదిగిపోయి.. ఎంతో మంది భామలకు ఆదర్శప్రాయమై పోయింది ప్రియాంక చోప్రా. అయితే గెలవడం అంటే తనకు క్యాండీ క్రష్ గేమ్ ఆడడంలాంటిదని ఆమె పోల్చడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. “ఒకసారి విజయం సాధించామని అనిపిస్తే.. ముందు అనుకున్నది సాధించినట్లే. నాకు గెలవడమంటే చాలా ఇష్టం. సక్సెస్ అనేది క్యాండీ క్రష్ గేమ్‌లాంటింది. ఎందులోనైనా నేను ఒకసారి గెలిచానంటే… ఆతర్వాత దాని గురించి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించను. ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్స్ నిర్దేశించుకొని వాటివైపు ప్రయాణిస్తా”అని చెప్పింది ప్రియాంక. కెరీర్ ప్రారంభంలో ఎంతో కష్టపడ్డ తాను పట్టుదలతో అనుకున్నది సాధించి టాప్ హీరోయిన్‌గా ఎదిగానని ఆమె పేర్కొంది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లడంతో తన ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పింది ప్రియాంక చోప్రా. ఇక తన డ్రెస్సింగ్ గురించి కామెంట్లు చేసేవాళ్లకు గట్టిగా బదులిచ్చింది ఈ భామ. సముద్రంలోకి దిగి స్విమ్ చేయాల్సినప్పుడు చీర కట్టుకొని దిగలేం కదా? అని ఆమె ప్రశ్నించింది. ఎక్కడ ఏ డ్రెస్ సౌకర్యంగా ఉంటుందో అదే వేసుకుంటామని ప్రియాంక పేర్కొంది.
అనుభవాలు పుస్తక రూపంలో ‘అన్‌ఫినిష్డ్’
మిస్ వరల్డ్ టైటిల్ విజేతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రియాంకచోప్రా హిందీ చిత్రసీమలో అగ్ర నాయికగా పేరు తెచ్చుకుంది. ఆపై హాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడ కూడా విజయకేతనాన్ని ఎగరేసింది. ఇటీవలే హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్‌జోనస్‌ను పెళ్లాడిన ఈ సొగసరి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే విరామ సమయాల్లో ఈ అమ్మడు తన జీవితంలోని ముఖ్యఘట్టాల్ని పొందుపరుస్తూ ఓ పుస్తకాన్ని రాస్తున్నదట. ప్రియాంక జీవన గమనంలో మరపురాని జ్ఞాపకాలకు అక్షరరూపమిదని, ఎవరికి తెలియని ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయని ప్రియాంక సన్నిహితులు పేర్కొన్నారు. ‘అన్‌ఫినిష్డ్’ అనే శీర్షికతో ఈ పుస్తకం రాబోతున్నదని సమాచారం. ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ ఈ పుస్తక ముద్రణ బాధ్యతల్ని తీసుకుందని తెలిసింది