దాంతో పాటు మానసిక సంతృప్తి కూడా కావాలి !

‘అర్జున్‌ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే ఆ సినిమా చేసిన తరువాత దాదాపు రెండు సంవత్సరాలకి తెలుగులో ‘118’ సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్‌ పాత్ర చేసింది. ఈ సినిమా విజయాన్ని అందుకున్న సందర్భంగా షాలినీ పాండేని ‘అర్జున్‌ రెడ్డి’ తరువాత ఇంత గ్యాప్‌ తీసుకోవడానికి కారణం ఏమిటని అడిగితే …
‘మధ్యలో ‘మహానటి’; ‘కథానాయకుడు’ సినిమాలు చేశాను. చిన్న పాత్రలే అయినా మంచి పేరు తీసుకొచ్చాయి. నా కొత్త సినిమా ‘118’లో కూడా మంచి పాత్రే లభించింది. అసలు ‘అర్జున్‌ రెడ్డి’ తరువాత చాలా కథలు విన్నాను. ఏవీ నాకు నచ్చలేదు. అందుకే ఏ సినిమా ఒప్పుకోలేదు.మధ్యలో తమిళం లో కూడా కొన్ని సినిమాలు చేశాను. కేవలం డబ్బు కోసమే నేను ఈ రంగంలోకి వచ్చి ఉంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించేదాన్నేమో! నాకు డబ్బుతో పాటు మానసిక సంతృప్తి కూడా కావాలి. అందుకే ఆచితూచి సినిమాలు చేస్తున్నాను. నాకు కథ నచ్చితే అది పెద్ద సినిమానా? చిన్న సినిమానా? అని ఆలోచించను. కథ బాగాలేకపోతే ఎంత పెద్ద బ్యానర్‌లో చేసినా ఫ్లాప్‌ చవిచూడాల్సిందే..’’ అని షాలినీ పాండే తెలిపింది.
 
విమర్శించిన వారితోనే ప్రశంసలు !
మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షాలిని పాండే చదువుకునే రోజుల్లోనుండే సినిమా రంగంలోకి రావాలని కలలు కంటూ ‘థియేటర్ ఆర్ట్స్‌’లో శిక్షణ కూడా పొందిందట. కానీ సినిమాల్లోకి రావడానికి తండ్రి విభేదించడంతో ఇంట్లోనుండి పారిపోయి చాలా కష్టాలు అనుభవించిందట. షాలిని తండ్రి ఆమెను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే ఓ దశలో తండ్రిపై పోలీస్ కేసు పెట్టడానికి కూడా సిద్ధపడిందట షాలిని. దీంతో ఇక ఎప్పుడుకూడా ఇంటి గడప తొక్కొద్దని వార్నింగ్ ఇవ్వడంతో ఓ చిన్న గదిలో ఉంటూ దుర్భరజీవితం గడిపిందని సమాచారం. డబ్బులు తక్కువగా ఉండటంతో ఒక్కోసారి పస్తులుండటం, ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్లి రావడం లాంటి కష్టాలెన్నో ఎదుర్కొందట. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఆఫర్ వచ్చాక సినిమా షూటింగ్ ప్రారంభానికి కొన్నిరోజుల సమయం ఉండటంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆ గదిలోనే ఉంటూ నరకం అనుభవించిందట షాలిని.ఎలాగోలా కష్టాలనుదాటి కొందరు స్నేహితుల సహకారంతో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అవకాశం సంపాదించిన ఈమె తొలి ప్రయత్నంలోనే తనను విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంటుండటం విశేషం.