ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.
కోడి రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. సినీరంగంలో ఆయనది 30 ఏళ్ల ప్రస్థానం. ఆయన 100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. ఏకంగా 525 రోజులు ఆడింది. ఆ తర్వాత ‘మంగమ్మగారి మనవడు’, ‘ఆహుతి’, ‘శత్రువు’, ‘అమ్మోరు’, ‘ముద్దుల మావయ్య’, ‘మా ఆవిడ కలెక్టర్’, ‘పెళ్లి’, ‘దొంగాట’, ‘అంజి’, ‘దేవీపుత్రుడు’, ‘దేవి’, ‘దేవుళ్లు’ ‘అరుంధతి’ తదితర విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ నటులు అర్జున్, భానుచందర్, సుమన్‌లను ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం ఆయనకు లభించింది. 10 నంది పురస్కారాలు కోడి రామకృష్ణ అందుకున్నారు. అంతేకాకుండా నటుడిగానూ ఆయన పలు చిత్రాల్లో నటించారు. ‘దొంగాట’, ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’, ‘అత్తగారూ స్వాగతం’, ‘ఇంటి దొంగ’, ‘మూడిళ్ల ముచ్చట’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. 1979లో కోరికలే గుర్రాలైతే చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా కోడి రామకృష్ణ పనిచేశారు.
కోడిరామకృష్ణది ప్రత్యేకశైలి
తెలుగు సినీ పరిశ్రమలో 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన అతికొద్ది మంది దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. కుటుంబ కథలను, ఫాంటసీ కథలను తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తారు. నాటకాలతో తన కెరీర్‌ను ప్రారంభించిన కోడి రామకృష్ణ దర్శకుడిగా అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. అసాధారణ కథలకు, అద్భుతమైన గ్రాఫ్రిక్స్ జోడించి ప్రేక్షకులను అలరించడంతో కోడిరామకృష్ణది ప్రత్యేకశైలి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దాసరి నారాయణరావు తొలిచిత్రం ‘తాత మనవడు’ చూశాక రామకృష్ణకు దర్శకత్వ శాఖలో పని చేయాలని సంకల్పం ఏర్పడింది.రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రాం రావడంతో, ఛార్జీల కోసం ‘పల్లెపడుచు’ నాటకాన్ని ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బయలుదేరారు. దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘స్వర్గం నరకం’, ‘మనుషుల్లో దేవుడు’ సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకూ దర్శకత్వ శాఖలో పనిచేశారు.
కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’(1981). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయం చేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన ‘తరంగిణి’ సినిమానే తొలి చిత్రంగా తీద్దామనుకున్నా అది వీలుపడక ‘ఇంట్లో రామయ్య’తో దర్శకుడయ్యారు. ఆ తర్వాత చిరంజీవితో ‘ఆలయశిఖరం’, ‘సింహపురి సింహం’, ‘గూఢచారి నెం.1’, ‘రిక్షావోడు’, ‘అంజి’ చిత్రాలు తెరకెక్కించారు. బాలకృష్ణకు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం ‘మంగమ్మగారి మనవడు’. తర్వాత బాలకృష్ణతో ‘ముద్దుల కృష్ణయ్య’, ‘ముద్దులమావయ్య’, ‘మువ్వగోపాలుడు’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘బాలగోపాలుడు’ వంటి చిత్రాలు తీశారు. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో తీసిన ‘అమ్మోరు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘దేవి’, ‘దేవీ పుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.