అదితీరావ్ హైదరీ… “సినిమా మొత్తం నేనే కనపడాలన్న కోరిక నాకు లేదు. నేను తెరమీద కనిపించేది కొన్ని నిమిషాలైనా సరే, ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోవాలి. ప్రయోగాత్మక సినిమాలకే నా ఓటు. నా సినిమాలు గమనిస్తే ఈ విషయం వెంటనే అర్ధమవుతుంది. ఈ విషయంలో హాలీవుడ్ హీరోయిన్లు నాకు ఆదర్శం. వారు ఇలాగే ఆలోచిస్తారు”….అని అంటోంది ‘చెలియా’, ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ నాయిక అదితీరావ్ హైదరీ
ఏదైనా ఒక సినిమా ఒప్పుకుంటే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాను. ఆ పాత్ర పడే సంతోషం, బాధ, ఆనందం, దుఃఖం అన్నీ నేను నిజజీవితంలో పడినట్టే ఫీలవుతాను. దాంతో సహజంగా నటిస్తాను. ఇందులో నా గొప్పతనం కన్నా దర్శకుల గొప్పతనమే ఎక్కువ. నాకు అర్ధమయ్యేటట్టు కథ చెప్పడం, పాత్రకి అవసరమైన నటన రాబట్టడం వారి గొప్పతనమే తప్ప నాది కాదు.
నా కెరీర్ బాలీవుడ్లోనే ప్రారంభమైంది. అక్కడ చేస్తున్న సమయంలో దక్షిణాదిన అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తుండడంతో హిందీ సినిమాకి డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరలేదు.ప్రస్తుతం దక్షిణాదిన రెండు సినిమాలు చేస్తున్నాను. బాలీవుడ్లో ఓ సినిమా చేయబోతున్నాను.
దత్తత చాలా గొప్ప పని
నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అనాధలను దత్తత తీసుకొని వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. దత్తత తీసుకోవడమనేది చాలా గొప్ప పని నా ఉద్దేశం. మరో రెండు సంవత్సరాలలో నా కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నా. స్ఫూర్తి ఎవరంటే చెప్పడం కష్టమే! కనీసం ఎనిమిది మందిని అని అనుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ కూడా తీసుకుంటాను. లక్కీ నెంబర్లను నేను నమ్మను. అసలు అలాంటి నమ్మకాలే నాకు లేవు.