‘యంగ్ రెబెల్‌స్టార్’ ప్రభాస్… ఆరేళ్ల కాలంలో మాత్రం మూడంటే మూడు సినిమాలతో అలరించాడు. ఇలాంటి రిస్క్ హాలీవుడ్ హీరోలు కూడా చేయరేమో. కానీ,ప్రభాస్ నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. ‘మిర్చి’ తరువాత రెండేళ్లకి ‘బాహుబలి’, ఆ తరువాత మరో రెండేళ్లకి ‘బాహుబలి 2’తో పలకరించాడు. మళ్లీ ఇంతవరకూ సినిమా లేదు. ఇంతకీ ‘సాహో’ ఎప్పుడు?. ఆగస్ట్ 15 దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు.
‘బాహుబలి’ తరువాత ప్రభాస్ చకచకా సినిమాలు చేస్తాడనుకున్నారు.అయితే ప్రభాస్ మరో భారీ సినిమా ‘సాహో’కి సై అన్నాడు. ఆ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్‌తో పాటూ భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రెడీ అవుతుండటంతో టైం తీసుకుంటోంది. అయితే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటికే గ్రాఫిక్ వర్క్ 50 శాతం పూర్తైందట. ఇక మిగతా 50 శాతంతో పాటూ షూటింగ్ పార్ట్ కూడా జూన్‌కల్లా కంప్లీట్ చేస్తారట. జూలై నుంచీ ప్రమోషన్స్ మొదలు పెట్టి ఆగస్ట్ 15న జనం ముందుకు తీసుకువస్తారట. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ‘సాహో’లో శ్రద్ధకపూర్ హీరోయిన్.
అలాంటి స్క్రిప్ట్ వినటమే మొదటిసారి !
‘సాహో’ తరువాతి చిత్రంగా రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పీరియాడిక్ ప్రేమకధ చేస్తున్నాడు.ప్రభాస్ సరసన పూజాహెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది.కొన్ని దశాబ్దాల క్రితం ఇటలీలో జరిగిన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి పూజా మాట్లాడుతూ…. రాధాకృష్ణ చెప్పిన కథ విన్నాక తన మతి పోయిందని చెప్పుకొచ్చింది. అసలు అలాంటి స్క్రిప్ట్ వినటమే మొదటిసారని పూజా తెలిపింది. ‘‘దర్శకుడు రాధాకృష్ణ ఈ కథ వినిపించినప్పుడు నాకు మతిపోయింది. అంతటి అద్భుతమైన కథ ఇది. ఈ తరహా స్క్రిప్ట్‌ను వినడం కూడా నాకు ఇదే మొదటిసారి. ఇందులో నా పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంది’’ అని అంటోంది.
రెండు వందల కోట్లు దాటేసింది !
నిర్మాతలు ‘బాహుబలి’ స్పూర్తితో భారీ బడ్జెట్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్ లో చాలానే సినిమాలే రూపొందుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటించే సినిమాల బడ్జెట్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న ‘సాహో’ సినిమాను మొదట రెండు వందల కోట్లలో రూపొందించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో యాభై కోట్లు పెరగనుందని తెలుస్తోంది.
అలానే ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమాకు కూడా రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నారని వినికిడి.పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందించనున్న సినిమాకు ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇటలీ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో పాతకాలం సెట్లు, నిర్మాణ ఖర్చు మొత్తం కలుపుకొని రెండు వందల కోట్లు దాటేసిందట.