‘లెజండరీ’ సింగర్ కె.జె.ఏసుదాస్… చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 20న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కాన్సర్ట్ జరగనుంది. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్‌తోపాటు విజయ్ ఏసుదాస్, కల్పన కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో జనవరి 19న కె.జె.ఏసుదాస్, ఆయన తనయుడు విజయ్ ఏసుదాస్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కె.జె.ఏసుదాస్ మాట్లాడుతూ…
‘‘నేను అక్షరాల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను. ఇది నా తల్లి నుంచి నేర్చుకున్నాను. నేను క్రిష్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ సంస్కృతంలోని అక్షరాలను నేర్చుకోమని ఆమె చెప్పారు. అది ఆమె నాకు అందించిన ఆశీర్వాదం. మరో ఆశీర్వాదం ఏమిటంటే.. నేను ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు “చదువు గురించి ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు. నార్మల్‌గా చదువుకుంటే చాలు. కానీ, కర్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్‌ని ప్రాపర్‌గా నేర్చుకో”మని చెప్పారు. మ్యూజిక్, ఆర్ట్స్‌లాంటివి ఏమీ వద్దు.. స్కూల్‌కి వెళ్ళి చదువుకోమని చెప్పే ఆరోజుల్లో నన్ను సంగీతం నేర్చుకోమని ప్రోత్సహించారు. నాకు బ్రదర్స్, సిస్టర్ ఉన్నారు. వాళ్ళు కూడా బాగా పాడేవారు. కానీ, వాళ్ళను మా నాన్నగారు ఎంకరేజ్ చెయ్యలేదు. నన్ను మాత్రమే ఈ విషయంలో ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నా తల్లిదండ్రుల్ని, నా మాస్టర్ని గుర్తు చేసుకుంటున్నాను. గురువు లేకుండా ఎవరూ గొప్పవారు కాలేరు. మనల్ని తీర్చిదిద్దిన గురువులు అంతా దేవుళ్ళతో సమానం. అది నా నమ్మకం. నేను ఇప్పటివరకు ఏం సాధించినా అదంతా నా తల్లిదండ్రులు, గురువుల వల్లే సాధ్యమైంది. అలాగే నా పాటలు వినేవారు, సంగీత ప్రియుల ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అంతకుమించి మరేం లేదు.
నేను దాదాపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ చేస్తున్నాను. మధ్యలో కొన్ని క్లాసికల్ కాన్సర్ట్స్ చేసినప్పటికీ లైవ్ మ్యూజిక్ మాత్రం చాలా కాలం తర్వాత చేస్తున్నాను. నా బ్రదర్ అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ నన్ను లైవ్ మ్యూజిక్ చెయ్యమని చెప్పారు. హైదరాబాద్‌లో మళ్లీ ఈ కాన్సర్ట్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాన్సర్ట్‌లో ప్రధానంగా తెలుగు పాటలు పాడతాము. అలాగే కొన్ని తమిళ్, హిందీ, మలయాళం పాటలు ఉంటాయి.
సింగర్స్ మధ్య సాన్నిహిత్యం ఉండేది !
నేను త్రివేండ్రంలో విద్వాన్ కోర్సు చేశాను. ఆ సమయంలో నా తండ్రిగారు అస్వస్థతకు లోనుకావడం, ఆర్థికంగా సరైన స్థితిలో లేకపోవడం వల్ల ఆ కోర్సు పూర్తి చేయకుండానే వచ్చేయడం జరిగింది. అందుకే నేను సంగీతంలో విద్వాన్‌ని కాదు, విద్యార్థిని మాత్రమే. ప్రతి రోజూ కర్నాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటూనే ఉంటాను. అంతకుముందు నేను చేసిన పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటాను. విద్యార్థులెవరైనా ఇది గుర్తుంచుకోవాలి. ముందు రోజు చేసిన తప్పుల్ని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోగలిగితే ముందు ముందు ఎంతో సాధించవచ్చు. ఇది సంగీతానికి మాత్రమే కాదు, ఏ రంగానికైనా వర్తిస్తుంది. మా నాన్నగారు చనిపోయేవరకు కూడా ఒక్కసారి కూడా నేను బాగా పాడుతున్నానని చెప్పలేదు. మన పిల్లల్ని మనమే అప్రిషియేట్ చెయ్యకూడదు. వాళ్ళకు వాళ్ళు ఎదగాలి. మా అబ్బాయి విజయ్ కూడా పాటలు పాడుతున్నాడు. అతని వయసు ఇప్పుడు 40. నా వయసు 79. కానీ, నేను ఇప్పటికీ విద్యార్థిననే చెప్తున్నాను. కానీ, మా అబ్బాయి ఆలోచన వేరుగా ఉండొచ్చు. ఇప్పుడొస్తున్న సింగర్స్ చాలా మంది బాగా పాడుతున్నారు. ఇప్పుడు సౌకర్యాలు బాగా పెరిగాయి. ఆరోజుల్లో నేను, సుశీల డ్యూయట్ పాడితే ఒకే మైక్‌లో ఒకరి తర్వాత ఒకరం పాడేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు. డిఫరెంట్ ట్రాక్స్ వచ్చేసాయి. నిన్న నేను ఓ మలయాళం పాట పాడాను. నాతో పాట పాడే అమ్మాయిని నేను చూడలేదు కూడా. నా ట్రాక్ వరకు నేను పాడాను. తర్వాత ఆమె పాడిన ట్రాక్‌ని మిక్స్ చేస్తారు. అయితే ఆరోజుల్లో సింగర్స్ మధ్య సాన్నిహిత్యం ఉండేది’’ అన్నారు.
విజయ్ ఏసుదాస్ మాట్లాడుతూ… ‘‘మొదట్లో నేను నాన్నగారి అడుగుజాడల్లోనే వెళ్ళాను. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. ఎందుకంటే అవి ఆయన వేసుకున్న ఫుట్‌స్టెప్స్. అందుకే నా సొంతదారిలోనే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అయితే కొన్ని విషయాల్లో ఆయన గైడెన్స్ తీసుకుంటాను. నాన్నగారి టైమ్‌లో ఇళయరాజాగారితో కలిసి చాలా సినిమాలకు పనిచేశారు. ఇద్దరూ ఫ్రెండ్స్‌లా, బ్రదర్స్‌లా ఉండేవారు. అలాగే ఇప్పుడు నేను, యువన్‌శంకర్‌రాజా కలిసి పనిచేస్తున్నాం. నాన్నగారు ఈ వయసులో కూడా ఇంకా నేర్చుకుంటున్నానని చెప్పడం మా జనరేషన్‌కి టెన్షన్ కలిగిస్తుంది. నేను రెండు సినిమాల్లో నటించాను కూడా. అయితే నేను నటుడ్ని కాదు. కెమెరా ముందు ఉండడం, యాక్ట్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు బయోపిక్‌లు చాలా వస్తున్నాయి. అలాగే నాన్నగారి బయోపిక్ చేసే ఆలోచన ఉందా? అని అడుగుతున్నారు. అయితే నాకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. కానీ, ఎవరైనా చేస్తే నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు.