పాతకధతో కొత్త వినోదం… ‘ఎఫ్-2′(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 3/5

శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
కధలోకి వెళ్తే…
ఎమ్మెల్యే ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్‌గా ఉండే వెంకీ(వెంక‌టేష్‌)కు హారిక‌(త‌మ‌న్నా)తో పెద్ద‌లు సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేస్తారు. అలాగే బోర‌బండ‌కు చెందిన వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌)కు హారిక చెల్లెలు హ‌నీ(మెహ‌రీన్‌)తో నిశ్చితార్థం అవుతుంది. పెళ్లి త‌ర్వాత హారిక‌, ఆమె త‌ల్లి చేసే ప‌నుల వ‌ల్ల వెంకీకి ఫ్ర‌స్టేష‌న్ పెరిగిపోతుంటుంది. వ‌రుణ్‌ను క‌లిసిన త‌ర్వాత వెంకీ పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని స‌ల‌హా ఇస్తాడు. కానీ వెంకీ మాట‌ల‌ను వ‌రుణ్ ప‌ట్టించుకోడు. ఇంటి ప‌క్క‌నుండే వ్య‌క్తి(రాజేంద్ర‌ప్ర‌సాద్‌) స‌ల‌హాతో ముగ్గురు క‌లిసి యూర‌ప్ ట్రిప్‌కి వెళ‌తారు. విష‌యం తెలుసుకున్న హారిక‌, హానీ కూడా యూరప్‌కి బ‌య‌లుదేరుతారు. అంద‌రూ ప్ర‌కాష్ రాజ్ ఇంట్లో చేరుతారు. అక్క‌డ నుండి ఫ‌న్నీగా సినిమా సాగిపోతుంది. అస‌లు అంద‌రూ ప్ర‌కాశ్ రాజ్ ఇంటికి ఎందుకు వెళ‌తారు. పెళ్లి అనే బంధం నుండి వెంకీ, వ‌రుణ్‌లు బ‌య‌ప‌డ్డారా? భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య అనుబంధాన్ని వారు గుర్తించారా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
 
విశ్లేషణ…
కామెడీని హ్యాండిల్ చేయడంలో ‘పటాస్’ నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తనదైన మార్క్ కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి మరోసారి ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌ తో ఆకట్టుకున్నాడు.కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా కట్టిపడేసే సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వించాడు. ప్రతీ ఇంట్లో రెగ్యులర్‌గా జరిగే సన్నివేశాలనుంచే కామెడీ జనరేట్‌ చేశాడు. భార్య భర్తల మధ్య జరిగే గొడవలు, వాటి పరిణామాలు, పుట్టింటి వారి మాటలు ఇలా ప్రతీది ఎంతో ఫన్‌ క్రియేట్ చేసింది. రచయితగానూ అనిల్ రావిపూడి ఫుల్‌ మార్క్‌ సాదించాడు. అనిల్ రాసిన డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. ఫ‌స్టాఫ్ ఫుల్ కామెడీతో ఉంటుంది. సెకండాఫ్ కూడా కామెడీతో ర‌న్ అవుతుంది కానీ.. ఫ‌స్టాఫ్ మీద కామెడి  త‌గ్గింది. తొలి భాగాన్ని ఏమాత్రం పట్టు తప్పకుండా సరదా యాత్ర లా నడిపించిన దర్శకుడు  ద్వితియార్ధంపై ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్టు లేడు. ఫస్ట్‌ హాఫ్‌లో వున్న ఫన్‌ సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి చాలా వరకు తగ్గుతుంది. ఈ సినిమా గతంలో వచ్చిన `క్షేమంగా వెళ్లి లాభంగం రండి`  ని కాసేపు గుర్తు చేస్తే…`సందడే సందడి`  ని ఇంకాసేపు గుర్తు చేస్తుంది.మొత్తం మీద సంక్రాంతికి ఏ తరహా వినోదాన్ని, కాలక్షేపాన్ని అయితే ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి వినోదాన్నిఅందించింది ఈ ‘ఎఫ్‌2’
 
నట వర్గం…
వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి  మనకు ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల్లోని తన కామెడీని గుర్తుకు తెస్తారు. ఈ సినిమాలో ప్రధానంగా వెంకీ, పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషన్ కి గురి అయ్యే సన్నివేశాల్లో గాని, వరుణ్ తేజ్ తో సాగే సన్నివేశాల్లో గాని, అలాగే క్లైమాక్స్ లో కూడా తనలోని కామెడీ యాంగిల్, మాడ్యులేషన్ తో బాగా అలరిస్తారు. వరుణ్ తేజ్ మొట్ట మొదటి సారి  కామెడీ సినిమాలో నటించారు. అయితే వెంకటేష్ కామెడీ టైమింగ్ ముందు వరుణ్ లోని కామెడీ యాంగిల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. ఉన్నంతలో వరుణ్ బాగానే నవ్విస్తాడు. ఇక భర్తను ఇబ్బందులకు ఫ్రస్ట్రేషన్ కి గురి చేసే పెత్తనం గల భార్యగా నటించిన తమన్నా, అదేవిధంగా  తమన్నా లాంటి ప్రవర్తనే కలిగిన మెహరీన్ తమ నటనతో పాటు తమ గ్లామర్ తోనూ ఆకట్టుకున్నారు. తమన్నా ఎప్పటిలాగే బాగా చేయగా.. పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేదు అని పేరు ఉన్న మెహరీన్ కూడా ఈ సినిమాలో తన తన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తోంది.ఓ కీలక పాత్రలో నటించిన ఒకప్పటి కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కూడా తన కామిక్ హావభావాలతో నవ్విస్తారు. ముఖ్యంగా హరితేజకు ఆయనకు మధ్య వచ్చే హాస్య సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తోంది. సీనియర్ నటులు నాజర్, ప్రకాష్ రాజ్, అలాగే ప్రకాష్ రాజ్ కొడుకులుగా నటించిన సుబ్బరాజు మరియు సత్యం రాజేష్ లు కూడా తమ నటనతో మెప్పిస్తారు.
 
సాంకేతికంగా…
దేవిశ్రీ సంగీతం చెప్పుకోదగ్గదిగా లేదు.. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ముఖ్యంగా యూరప్‌ అందాలను చాలా బాగా తెర మీద ఆవిష్కరించారు. త‌మ్మిరాజు ఎడిటింగ్‌ బాగుంది – రాజేష్