“1997”… డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో.. డా.మోహన్ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ‘1997’ చిత్రం ఈ నెల 26న విడుదల సందర్బంగా 1997 చిత్రం నటుడు ,దర్శకుడు డా.మోహన్ ఇంటర్వ్యూ విశేషాలు …
ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ కథ…ఇందులో ఒక అమ్మాయిని రేప్ చేసిన తరువాత ఆమె పడే మానసిక వేదన, ముఖ్యంగా ఆమె తల్లి తాలూకు ఎమోషన్ ఎలా ఉంటుంది?… నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఒక అమ్మాయిని రేప్ చేసాక చంపేస్తున్నారు. ఎందుకు ? అమ్మాయిని రేప్ చేయడానికి కారణం కామం. ఆ కామాన్ని తీర్చుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు అమ్మాయిలను రేప్ చేస్తున్నారు. ఇది ఓ డోరా అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథ. తక్కువ కులానికి చెందిన వాళ్ళను ఇంట్లోకి రానివ్వరు, గుడిలోకి రానివ్వరు.. కానీ ఆమె లైంగిక వాంఛ తీర్చుకోవడానికి పనికి వస్తుందా ? ఇక్కడ లేని అంటరానితనం.. అక్కడ ఎందుకు లేదు? అన్న అంశంతో ఈ సినిమా ఉంటుంది.
మా తాతగారు చెప్పిన కథ ఇది !
1997 లో జరిగిన కథ కాదు.. నేను ఆ సమయంలో విన్న కథ, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాను, హాలిడేస్ కు ఊరికి వెళ్ళినప్పుడు మా తాతగారు చెప్పిన కథ ఇది. అప్పటినుండి ఆ కథ నా మైండ్ లో అలా ఉండిపోయింది. ఆ కథను తెరపై ఆవిష్కరించాలని ఉద్దేశంతో సినిమాగా తీసాను. ఇలాంటి సంఘటనలను ప్రజలకు చెప్పాలనే ఈ ప్రయత్నం.
ఈ కథ ఆలోచన వచ్చాక దాన్ని రాసుకున్నాను . ఆ తరువాత నటుడు జీవి నాకు ఫ్రెండ్. ఆయనను కలిసాను, కథ విన్నాక అయన కూడా ‘చాలా బాగుంది’ అన్నారు. మరి దీన్ని తెరపైకి తేవాలనే ఆలోచనతో నిర్మాతలను కలవడం, అదంతా వర్కవుట్ కాకపోవడంతో.. మనమే చేయాలనీ మొదలెట్టాం. అలాగే దర్శకత్వం విషయంలో కూడా వేరే దర్శకులను అడిగాను. కానీ కథను నేను చెప్పాలనుకున్న విధంగా వారు చెయ్యలేకపోవడంతో.. ఇలా కాదు అని నేనే చెయ్యాలని ఈ చిత్రానికి దర్శకత్వం చేశాను.
సీన్స్ చాలా సహజంగా అనిపిస్తాయి !
ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కూడా జరుగుతూనే ఉన్నాయి. వాంఛ తీర్చుకోవడానికి అమ్మాయిని రేప్ చేయాలా ? వాంఛ తీర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయ్ కదా!. అలాగే తక్కువ జాతి వాళ్లపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమా అంత ఘాడంగా ఏమి ఉండదు. చాలా కూల్ గా సినిమా సాగుతుంది. సీన్స్ కూడా చాలా సహజంగా అనిపిస్తాయి.
ఇలాంటి కథ కమర్షియల్ గా చెప్పడం కష్టం!
ఈ చిత్రాన్ని కమర్షియల్ వే లోనే చెప్పే ప్రయత్నం చేసాం. ఈ కథను చెప్పుకుంటే పొతే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. కాబట్టి .. దాన్ని కమర్షియల్ హంగులతో చూపించే ప్రయత్నం చేసాం. అయితే ఇందులో ఐటెం సాంగ్, అమ్మాయి ఎక్స్పోజింగ్ లాంటివి ఉండవు.
మొదటి సినిమాకే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా…
ఈ కథ అనుకున్నాక ఇందాక చెప్పినట్టు కథ ఎలాగైనా తెరపై కనిపించాలంటే మనమే రిస్క్ చేయాలనీ ఫిక్స్ అయ్యాను. నిజం చెప్పాలంటే వేరే దారిలేక నేనే చేయాల్సి వచ్చింది. ఇందులో నేను ఐ పి ఎస్ పాసై అప్పుడే ఓ ఉరికి వెళ్లిన పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. ఊర్లలో జరుగుతున్న ఈ సంఘటనలను ఆపేందుకు ప్రయత్నం చేసే పోలీస్. అని రకాల షేడ్స్ ఉంటాయి.
నాకు ఏ పని చేసిన అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేయడం ఇష్టం. ఈ సినిమా విషయంలో నటుడిగా, దర్శకుడిగా నాకు రెండూ సంతృప్తిని ఇచ్చాయి. ఇవే కాదు నేను డాక్టర్ గా ఉన్నా. మాకు లీల గ్రూప్ పేరుతొ స్కూల్, బట్టల బిజినెస్ లు ఉన్నాయి. వాటిలానే ఈ బిజినెస్ విషయంలో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఆ పని చేశాను.
మా 1997 సినిమాకు కథే హీరో !
ఇందులో నవీన్ చంద్ర నా పై అధికారిగా కనిపిస్తాడు. నవీన్ చంద్ర నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. అద్భుతంగా చేసాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయన ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతారు. కాబట్టి ఇందులో చారి అనే పోలీస్ గా అదరగొట్టాడు. ఈ సినిమాలో నేను, నవీన్ చంద్ర హీరోలం కాదు. ఈ సినిమాకు కథే హీరో.
కోటి సినిమాకు ప్రధాన ఆకర్షణ !
నాకు మొదటి నుండి కోటిగారు బాగా పరిచయం. ఈ కథ అయన విన్నాక చాలా బాగుందని చెప్పారు. ‘నువ్వు సినిమా మొదటి సారి చేస్తున్నావు కాబట్టి సినిమా చేయి. మొదటి కాపీ వచ్చాక చేస్తా’నని అన్నారు . ఆ తరువాత సినిమా చూసి మోహన్ ‘ఈ సినిమాకు నేను మ్యూజిక్ చేస్తున్నాను. చాలా గొప్పగా తీశావ’ని అన్నారు. అయన ఆర్ ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అలాగే ‘ఏమి బతుకు’ సాంగ్ మంగ్లీ పాడింది. అది 8 మిలియన్ వ్యూస్ వరకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది.
సెన్సార్ వాళ్ళు అప్రిసియేట్ చేసారు!… చాలా బాగుంది. మంచి పాయింట్ ఎంచుకుని తీసారని అన్నారు . అక్కడ మహిళా సభ్యులైతే కన్నీళ్లు పెట్టించావని అన్నారు.